ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షను తన పర్యవేక్షణలో నిర్వహించే విషయమై సూచన ఇవ్వాలని అటార్నీ జనరల్(ఏజీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షను తన పర్యవేక్షణలో నిర్వహించే విషయమై సూచన ఇవ్వాలని అటార్నీ జనరల్(ఏజీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదావేసింది. విచారణ షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా, న్యాయయూర్తులు దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం దీన్ని ఉదయం 10.30 గంటలకే చేపట్టింది.
మధ్యాహ్నం 2గంటలకు జరగాల్సిన మెడికల్ ప్రవేశపరీక్షల విచారణలో జస్టిస్ శివకీర్తి సింగ్ భాగంగా ఉన్నందున ఉదయమే దీనిపై కొద్దిసేపు విచారించింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అసెంబ్లీలో బలనిరూపణను తన పర్యవేక్షణలో నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని్ర ఏజీ ముకుల్ రోహత్గీని అడిగింది. దీనిపై బుధవారం సూచన ఇవ్వాలని చెప్పింది.