తగ్గుతున్న మహిళా కార్మిక శక్తి

Under-Counts Women Participation in Labour Force - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత ఆరు ఏళ్ల క్రితంతో పోలిస్తే దేశంలో కూలి నాలి చేసి బతికే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గింది. వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 2011–12 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం ఉండగా, నేడు వారి సంఖ్య 18 శాతానికి పడిపోయింది. అదే పట్టణ ప్రాంతాల్లో 2011–12 ఆర్థిక సంవత్సరానికి పనిచేసే 15 నుంచి 14కు పడిపోయింది. అయితే పట్టణాల్లో నెలవారిగా వేతనాలు అందుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాంటి వారి సంఖ్య 2004లో 35.6 శాతం ఉండగా, 2017 నాటికి 52.1 శాతానికి చేరుకుంది.

దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పురుషులు, మహిళల సంఖ్య తగ్గుతోందని, మహిళల సంఖ్య మాత్రం ఏటేటా క్రమంగా తగ్గుతూ వస్తోందని 2017–18 సంవత్సరానికి దేశంలోని కార్మిక శక్తిపై నిర్వహించిన సర్వే వెల్లడిస్తోంది. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి పోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. దేశంలో గత 49 ఏళ్లలో ఎన్నడు లేనంతగా నిరుద్యోగుల శాతం 6.1 శాతానికి పెరిగిందని ఇటీవల విడుదల చేసిన లేబర్‌ ఫోర్స్‌ సర్వే తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి రంగంలో పనిచేసే మహిళలు 1993లో 33 శాతం ఉండగా, వారి సంఖ్య 2011–12 ఆర్థిక సంవత్సరం నాటికి 25 శాతానికి పడిపోయింది.

మహిళలు ఉన్నత విద్య అభ్యసించడం పట్ల ఆసక్తి చూపడం, భర్తల ఆదాయం పెరగడం, ఇంట్లో పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సి రావడం, మహిళలకు అనువైన ఉద్యోగాలు తగ్గిపోవడం లాంటి కారణాల వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి తగ్గుతూ వస్తోందని నిపుణులు అంటున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top