తెరపైకి మరో ఘర్షణ వీడియో

Undated video of fierce face-off between Indian and Chinese troops goes viral  - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచు కొండల నేపథ్యంలో భారత సైనికులు చైనా జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఆ వీడియో ఏ రోజు తీసిందనే వివరాలు అందులో లేవు. భారత సైనికుల బృందం చైనా ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్న మరో బృందంతో ఘర్షణ పడుతూ, వారిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అలాగే, వెనక్కు వెళ్లిపోవాలంటూ చైనా జవాన్లను భారత సైనికులు గట్టిగా చెబుతున్న మాటలు కూడా వినిపించాయి.

ఆ తరువాత వారు బాహాబాహీకి దిగినట్లుగా కనిపించింది. భారత సైనికుల మాటను వినకుండా, చైనా జవాన్లు అక్కడే ఉండటం, పైగా, భారత సైనికులపై వారు దాడి చేయడం 5.30 నిమిషాలున్న ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో దృశ్యాల్లో డేట్, టైమ్‌ లేవు కానీ, సైనికులు మాస్క్‌లు ధరించి ఉండటం కనిపించింది. దాన్నిబట్టి ఆ వీడియో కరోనా ముప్పు ప్రారంభమైన తరువాత తీసిన వీడియోగానే భావించవచ్చు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే.. ఆ ఘటన సిక్కింలో జరిగి ఉండొచ్చని ఆర్మీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అక్కడ కూడా మే తొలి వారం నుంచి ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మే 9న సిక్కింలోని నకూ లా ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అయి ఉండవచ్చనుకుంటున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top