ఆధార్‌ కోసం చంపేశారు!

Unable to show Aadhaar card, Kargil martyr's wife denied medical treatment, dies - Sakshi

ఆధార్‌ కార్డు తేనందుకు వైద్యం నిరాకరించిన ప్రైవేటు ఆస్పత్రి

ప్రాణాలు కోల్పోయిన కార్గిల్‌ అమరుడి భార్య

చండీగఢ్‌: ఆధార్‌ కార్డు తీసుకురానందుకు ఓ అమర జవాన్‌ భార్యకు ఆస్పత్రి సిబ్బంది చికిత్స నిరాకరించిన అమానవీయ ఘటన హరియాణాలోని సోనిపట్‌లో జరిగింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పరిస్థితి విషమించి బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, దోషులుగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తామని హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ శనివారం తెలిపారు.

సోనిపట్‌ జిల్లాలోని మెహలానా గ్రామానికి చెందిన శకుంతలా దేవీ(55) భర్త హవల్దార్‌ లక్ష్మణ్‌ దాస్‌ కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. శకుంతలా దేవీ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె కుమారుడు పవన్‌ తెలిపారు. దీంతో ఆమెను ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్‌) ఆస్పత్రికి గురువారం తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈసీహెచ్‌ఎస్‌ వర్గాలు ఆమెను తులిప్‌ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. ‘కౌంటర్‌లో పేషెంట్‌ ఆధార్‌కార్డు ఇవ్వాల్సిందిగా ఆస్పత్రి సిబ్బంది నన్ను కోరారు.

కార్డును ఇంట్లో మర్చిపోయాననీ ఈలోగా చికిత్స ప్రారంభించాలని వేడుకున్నాను. నా మొబైల్‌లో ఉన్న ఆధార్‌ కార్డు చూపించా. అసలైన ఆధార్‌ కార్డు ఇస్తేనే చికిత్స చేస్తామని సిబ్బంది స్పష్టంచేశారు’ అని కుమార్‌ చెప్పారు. నచ్చజెప్పినా వినకపోవడంతో తన తల్లిని తీసుకుని ఈసీహెచ్‌ఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా... ఆమె అదేరోజు ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఈసీహెచ్‌ఎస్‌ అధికారులకు తులిప్‌ ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశానన్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఓ బృందం సోనిపట్‌కు బయలుదేరిందని రాష్ట్ర ఆరోగ్యమంత్రి అనీల్‌ విజ్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top