బెంగళూరు నుంచి బీదర్‌కు విమాన సర్వీసు

UDAN Scheme: Trujet launches Bengaluru-Bidar daily flight - Sakshi

ఉడాన్ సేవలు విస్తరిస్తున్న ట్రూజెట్

బీదర్ వాసులకు చేరువ కానున్న బెంగళూరు

బెంగళూరు-బీదర్‌ ట్రూజెట్ విమాన సర్వీసును ప్రారంభించిన కర్ణాటక సీఎం

ప్రతీ రోజు బెంగళూరు-బీదర్‌ బెంగళూరు మధ్య విమాన సేవలు

ట్రూజెట్ విమానంలో బీదర్ వరకు ముఖ్యమంత్రి ప్రయాణం

బెంగళూరు: ఉడాన్ నెట్‌వర్క్‌ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్  టర్బో మేఘా ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రూజెట్ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్ నుంచి విమాన సేవలు ప్రారంభించింది. బీదర్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య శుక్రవారం నుంచి ప్రతీ రోజు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప ఇవాళ  బెంగళూరు విమానాశ్రయంలో ఈ సర్వీసు ప్రారంభించారు. 

బెంగళూరులో ట్రూజెట్ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బీదర్ వరకు ప్రయాణించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్‌కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్‌కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందన్నారు. ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమాన సర్వీసుల పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు

ఇక ట్రూజెట్ నెట్‌వర్క్‌లో బీదర్ 24వ స్టేషన్ కాబోతోంది. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్)- ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (ఉడాన్), సామాన్య మానవులు కూడా విమానాల్లో ప్రయాణించాలన్న ప్రధానమంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రూజెట్ విమానాల్లో 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆర్సీఎస్ I, II, III కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్.

ఈ సందర్భంగా టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ‘మా మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న మొదలపెట్టిన నాటి  నుంచి మేము చాలా దూరం ప్రయాణించాం. భారత్‌లోని ప్రథమశ్రేణి నగరాల నుంచి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న జాతి ఆకాంక్షలను మేము నెరవేర్చుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యాపారానికి, పర్యటక అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. విమాన అనుసంధానం అన్నది ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడమే కాకుండా ఉపాధి కల్పనకు సహకరిస్తుంది’ అని అన్నారు.

సీఈఓ కల్నల్ ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధానంలో బలమైన శక్తిగా ట్రూజెట్ నిలుస్తుంది. నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలో మా నెట్‌వర్క్‌ను 24స్టేషన్లకు విస్తరించగలిగాం. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎదిగేందుకు సుస్థిర అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించామన్నారు. కాగా బెంగళూరు-బీదర్‌ బెంగళూరు మధ్య కొత్త సర్వీసు ప్రారంభించిన సందర్భంగా ట్రూజెట్‌ నాలుగు రోజుల పాటు టికెట్ బేస్ ధరను రూ.699 గా అందిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top