ఆ హోటల్లో ట్రంప్‌ విడిది.. ఒక రాత్రి ఖర్చు..

Trump Going To Stay In Delhi Hotel Suite To Night Costs Rs 8 Lakh A Night - Sakshi

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘన స్వాగతం పలకడానికి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అగ్రజుని హోదాకు తగ్గట్లు మార్పు చేర్పులతో ఆకట్టుకునేలా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ట్రంప్‌ భారత్‌ రాక సందర్బంగా ఆయనకు సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ట్రంప్‌ దంపతులు బస చేయబోయే హోట్‌ల్‌ గదికి సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ దంపతులు అహ్మదాబాద్‌, ఆగ్రా పర్యటనల అనంతరం ఢిల్లీకి చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. వీరికోసం ఢిల్లీ ఐటీసీ మౌర్యా హోటల్‌లోని గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను కేంద్ర ప్రభుత్వం బుక్‌చేసింది. ఒక రాత్రికి ఆ సూట్‌లో ఉండటానికి అయ్యే ఖర్చు అక్షరాల 8 లక్షల రూపాయలు. అమ్మో అంత ఖర్చా! అంటూ నెటిజన్లు కూడా నోరెళ్లబెతున్నారు. ‘పెద్దన్నంటే మాటలు కాదుగా మరి.. ఆ మాత్రం ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (ట్రంప్‌ పర్యటన : సీక్రెట్‌ ఏజెన్సీ పనేంటంటే..)

ఇంతకీ ఆ గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ప్రత్యేకతలేంటంటే.. సిల్క్‌ ప్యానెల్డ్‌ గోడలు, వుడెన్‌ ఫ్లోరింగ్‌, అదిరిపోయే కళాకృతులు, సౌకర్యవంతమైన లివింగ్‌ రూం, ప్రత్యేకమైన డైనింగ్‌ గది, విలాసవంతమైన రెస్ట్‌రూం, మినీ స్పా, పర్శనల్‌ జిమ్‌ ఉన్నాయి. అంతేకాకుండా అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన 55 అంగుళాల హై డెఫినిషన్‌ టీవీ, ఐపాడ్‌ డాకింగ్‌ స్టేషన్‌, ఆహారాన్ని పరీక్షించేందుకు మైక్రోబయోలాజికల్‌ లాబొరేటరీ, బయట వైపు గాలి విషతుల్యంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్టర్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్‌ క్లింటన్, జార్జ్‌ బుష్‌లు బస చేశారు.

 కాగా, మరి కొద్ది గంటల్లో ట్రంప్‌ భారత గడ్డమీద అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ట్రంప్‌ దంపతులు అహ్మదాబాద్‌ చేరుకుంటారు. అహ్మదాబాద్‌ పర్యటన ముగిసిన వెంటనే కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రా సందర్శనకు వెళతారు. ( ‘మేడమ్‌ ఎక్కడా!!’? )

చదవండి : ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top