
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో పీప్లీ లైవ్ చిత్ర దర్శకుడు మహ్మద్ ఫరూఖికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఆయన నిర్దోషి అంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ కేసు ఇద్దరు కొత్త వ్యక్తులకు సంబంధించినది కాదని, ఇది వరకే సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల మధ్య కేసు అని, వారు ఇద్దరు ఒకరికి ఒకరు తెలిసిన వారేనని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇది చాలా కఠినమైన కేసు అని అయినప్పటికీ హైకోర్టు తుది తీర్పును చాలా బాగా ఇచ్చిందని కొనియాడింది.
అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న ఓ 30 ఏళ్ల మహిళ తనపై ఫరూఖి లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు పెట్టింది. అయితే, ఈ కేసును తొలిసారి విచారించిన కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50వేల ఫైన్ వేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసుపై ఆ మహిళ తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఆరోపణలు చేసిన తర్వాత కూడా డైరెక్టర్ ఫరూఖికి సదరు మహిళ ఓ మెయిల్ పంపిందని, అందులో ‘ఐలవ్ యూ’ అంటూ ఆయనకు చెప్పిందనే విషయాన్ని ఫరూఖి తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు ఆధారాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కోర్టు ఆ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి ఆమె తరుపు న్యాయవాదిని ప్రశ్నిస్తూ ‘మీరు ఎన్నో కేసులు వాధించారు. కానీ, బాధితురాలు ‘ఐలవ్ యూ’ చెప్పిన సంఘటనలు ఎన్ని జరిగాయి’ అని అడిగింది. దీనికి బదులిచ్చిన ఆయన తన ఫిటిషనర్ గతంలోనే ఫరూఖికి మంచి స్నేహితురాలు అని, వారు మంచి స్నేహితులు అని ఆయనపై ఎంతో నమ్మకం ఆమెకు అని చెప్పారు. అనంతరం ఫరూఖిని పిటిషనర్ ఎన్నిసార్లు కలిసి మద్యం సేవించింది అని మరో ప్రశ్న వేయగా బహుశా రెండుసార్లు అని, ఒకసారి మాత్రం ఒకరికొకరు ముద్దులు కూడ పెట్టుకున్నారని చెప్పారు. అనంతరం కాసేపు వాదనలు జరిగిన తర్వాత తాము హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నామని ఫరూఖిని నిర్దోషిగా మరోమారు ప్రకటించింది.