
ఖాకీలూ మనుషులేనని..నైట్ డ్యూటీ చేసి అలిసిపోయిన పోలీసులే కునికిపాట్లు పడ్డారన్న డీఐజీ
పాట్నా : దుర్గా పూజ వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని వివరించే సమావేశంలో నిద్రించిన ఖాకీల వీడియో వైరల్‌గా మారడంపై పాట్నా డీఐజీ స్పందించారు. పోలీసుల కునికిపాట్లను ఆయన సమర్ధిస్తూ కేవలం నైట్ డ్యూటీలో పనిచేసిన సిబ్బందే ఆ సమావేశంలో నిద్రిస్తూ కనిపించారని చెప్పుకొచ్చారు. రాత్రి డ్యూటీ ముగించుకుని వచ్చిన పోలీసులు మాత్రమే కునికిపాట్లు పడ్డారని, అందులో వారి తప్పేమీ లేదని అన్నారు.
సమావేశంలో వారు చురుకుగానే ఉన్నారని కేవలం రెండు మూడు నిమిషాల పాటు వారి కళ్లు మూతపడ్డాయని అంటూ వారు కూడా మనుషులేనని అన్నారు. కీలక సమావేశాల్లో నిద్రించే నేతలు, ఉద్యోగుల ఫోటోలు వైరల్ కావడం సాధారణంగా మారింది. చివరకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లోనూ ప్రజాప్రతినిధులు నిద్రలో జోగుతూ తరచూ కెమెరాల కంటపడుతున్నారు. తాము దీర్ఘాలోచనలో మునగడం వల్లే ఇలా కనిపించామని కొందరు కప్పిపుచ్చుకుంటుండగా, మరికొందరు ప్రజల కోసం తీరికలేకుండా కష్టపడటం వల్లే తమకు నిద్ర కరువై కునుకుతీశామని సమర్ధించుకుంటున్నారు.