బంగారం వద్దు.. మొక్కలే ముద్దు...!

బంగారం వద్దు.. మొక్కలే ముద్దు...!


ఆ సందర్భం దంపతుల పర్యావరణ స్పృహకు మారుపేరుగా... ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా మారింది. పెళ్ళిలో సంప్రదాయానుసారం అందించే బంగారం, డైమండ్స్ కు బదులుగా అత్తమామలను వధువు... బహుమతిగా  మొక్కలు కావాలని కోరడం...  మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో  అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ కు 80 కిలోమీటర్ల దూరంలోని భిండ్ జిల్లా కిసిపురా గ్రామమంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమం ప్రకృతి ప్రేమకు మారుపేరుగా నిలిచింది. 22 ఏళ్ళ సైన్స్ గ్రాడ్యుయేట్, వధువు ప్రియాంక తన అత్తవారు బహుమతిగా ఇచ్చే బంగారు నగలకు బదులు పచ్చని మొక్కలు కావాలని కోరడం ప్రత్యేకతగా నిలిచింది. ముందుగా అత్తమామలను ఆమె అభ్యర్థన ఆశ్చర్య పరచినా... చివరికి ఆమెలోని ప్రకృతి ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆధునిక కాలంలోనూ పర్యావరణంపై శ్రద్ధ చూపిస్తున్న వ్యక్తి కోడలుగా రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు.తనకు కాబోయే భార్య సంపద కంటే పర్యావరణంపై అధిక శ్రద్ధ చూపిస్తున్నతీరు ఎంతో ఆనందం కలిగించిందని వరుడు రవిచౌహాన్ ఓ పత్రికకు తెలిపారు. ఆభరణాల స్థానంలో ఆమె 10,000 మొక్కలను కోరడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు.  అడవులను నరికేస్తున్న నేపథ్యంలో పచ్చదనం క్షీణించి పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని, ముఖ్యంగా మధ్య ప్రదేశ్ లో ఈ కారణంగా భూమిలో నీరు ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని వధువు ప్రియాంక తెలిపారు. . పంట నష్టాలతో తీవ్ర నిరాశ చెందిన  తన తండ్రే ఇందుకు సాక్ష్యమని, పరావరణాన్ని రక్షించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు.గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడాలంటే పచ్చదనాన్ని పెంచాలన్న విషయాన్ని చిన్నతనంలోనే గుర్తించిన ప్రియాంక పెళ్ళి సందర్భాన్ని అందుకు అనువుగా మలచుకున్నారు. తాను కోరిన పదివేల మొక్కల్లో ఐదు వేలు తన తండ్రి ఇంట్లో, మరో ఐదు వేలు అత్తమామల ఇంట్లో పాతాలన్న యోచనతోనే  మొక్కలను బహుమతిగా కోరానన్నారు. చిన్నతనంనుంచే పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకున్నానని,  రైతులకు, కార్యకర్తలకు మొక్కలను పంచి పచ్చదనాన్ని మరింత పెంచాలన్నదే తన ఆశయమని ప్రియాంక చెప్తున్నారు. ఏప్రిల్ 22 న జరిగిన వివాహం అనంతరం  దంపతులిద్దరూ  గ్రామంలో రెండు మామిడి మొక్కలు పాతామని, అవి వాతావరణాన్ని రక్షిస్తాయన్న నమ్మకం ఉందని ఆమె చెప్తున్నారు. ఇకనుంచి ప్రతి పెళ్ళి రోజునాడు క్రమం తప్పకుండా మొక్కలు పాతే కార్యక్రమం చేపడతామని ప్రియాంక వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top