వెరై‘టీ’.. కిలో రూ. 40,000

Tea Variety From Arunachal Auctioned At Rs Forty Thousand - Sakshi

వేలం పాటలో రికార్డు ధర దక్కించుకున్న ‘గోల్డెన్‌ నీడిల్స్‌’   

గౌహతి: గౌహతి టీ వేలం కేంద్రంలో నిర్వహించిన  వేలం పాటలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని డానియి పోలో టీ ఎస్టేట్‌  మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఎస్టేట్‌లో పండించిన అరుదుగా లభించే గోల్డెన్‌ నీడిల్స్‌ తేయాకు వేలం పాటలో  కేజీ రూ. 40 వేలు పలికింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఎక్కువ ధర . అస్సామ్‌ టీ ట్రేడర్స్‌ అరుదైన ఈ రకం తేయాకులను వేలం పాటలో దక్కించుకున్నారు.  ఈ రికార్డుతో ప్రపంచ ‘టీ’ చరిత్రలో అరుణాచల్‌ప్రదేశ్‌ స్థానం సంపాదించింది.

గత నవంబర్‌లో డానియి పోలో ఎస్టేట్‌లోని ఓయమ్‌ గ్రామానికి చెందిన తేయాకు తోటల్లో పండిన  తేయాకు రకం కేజీ ధర రూ. 18,801 పలికింది. ‘ప్రత్యేకంగా పండించిన తేయాకులు కొనేందుకు  వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. గౌహతి వేలం కేంద్రంలో తమ ఉత్పత్తులను అమ్మేందుకు వ్యాపారులు  కూడా ముందుకు వస్తున్నారని’ గౌహతి టీ వేలంపాట దారుల అసోసియేషన్‌ కార్యదర్శి దినేష్‌బిహానీ చెప్పారు.

అరుదైన రకం
గోల్డెన్‌ నీడిల్స్‌ తేయాకు కాడలు చిన్నగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాటిని సేకరించాలి. ఆకు పై భాగం బంగారు వర్ణంలో ఉంటుంది. ఆకులు చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. ఈ పొడితో చేసిన టీ ముదురు బంగారు రంగులో ఉంటుంది. చెరుకు రసంలాంటి సువాసనతో తియ్యగా ఉంటుంది. ఈ ‘టీ పొడికి క్వాలిటీలో తిరుగులే దు..టీ ప్రేమికులు ఈ పొడిని దక్కించుకునేందుకు ఎంతైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు’ అని ఎస్టేట్‌ నిర్వాహకులు తెలిపారు. 

ఈ తేయాకును పండించడానికి ఎంతో శ్రమ కోర్చామని, దీని కోసం నిష్ణాతులైన పనివారు అవసరమని  టీఎస్టేట్‌ మేనేజర్‌ మనోజ్‌ కుమార్‌ చెప్పారు. దేశంలో ఈ రకం పడించే ఏకైక టీఎస్టేట్‌ తమదే అన్నారు.  మొదట తమ ఎస్టేట్‌లో తెల్ల రకానికి చెందిన సిల్వర్‌ నీడిల్స్‌ను పండించాం. ఇది  కేజీ రూ. 17,001 పలికింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top