మహిళా వ్యాపారవేత్తల్లో ఆ రాష్ట్రమే ఫస్ట్ | Tamil Nadu First place in Women entrepreneurs | Sakshi
Sakshi News home page

మహిళా వ్యాపారవేత్తల్లో ఆ రాష్ట్రమే ఫస్ట్

Oct 6 2016 4:25 PM | Updated on Sep 4 2017 4:25 PM

మహిళా వ్యాపారవేత్తల్లో ఆ రాష్ట్రమే ఫస్ట్

మహిళా వ్యాపారవేత్తల్లో ఆ రాష్ట్రమే ఫస్ట్

దేశంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారు

న్యూఢిల్లీ: దేశంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారు. అక్షరాస్యతకు, వ్యాపారానికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ఈ ఐదు రాష్ట్రాల్లో  అక్షరాస్యత కూడా ఎక్కువగా ఉంది. 73.4 శాతం అక్షరాస్యత కలిగిన తమిళనాడులోనే దేశంలోకెల్లా ఎక్కువ మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో పది లక్షల వ్యాపార సంస్థలను అంటే 13.5 శాతం వ్యాపార సంస్థలను మహిళలే నిర్వహిస్తున్నారు.
 
92 శాతం అక్షరాస్యత కలిగిన కేరళలో 11.3 శాతం వ్యాపార సంస్థలను మహిళలే నిర్వహిస్తున్నారు. 59.1 శాతం అక్షరాస్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10.5 శాతం వ్యాపార సంస్థలను, 70.5 అక్షరాస్యత కలిగిన పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో 10.3 శాతం వ్యాపార సంస్థలను, 75.9 శాతం అక్షరాస్యత కలిగిన మహారాష్ట్రలో 8.2 శాతం వ్యాపార సంస్థలను మహిళలు నిర్వహిస్తున్నారు. దేశంలో మహిళా వ్యాపారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మహిళల కార్మిక శక్తి మాత్రం తగ్గుతోందని ‘ఇండియా స్పెండ్’ అనే సంస్థ వెల్లడించింది.
 
దేశవ్యాప్తంగా సరాసరి అక్షరాస్యత 65.5 శాతం ఉండగా, మహిళల కార్మిక శక్తి మాత్రం సరాసరి 25.5 శాతం మాత్రమే ఉంది. ఈ శక్తి 1999లో 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయి ఇప్పుడు 25.5 శాతానికి చేరుకుంది. మహిళల కార్మిక శక్తి నేపాల్‌లో 79.9 శాతం ఉండగా, బంగ్లాదేశ్‌లో 57.4 శాతం, శ్రీలంకలో 35.1 శాతం ఉంది. పదవ తరగతికి పైగా చదువుకున్న మహిళల సంఖ్య కూడా ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 77.4 శాతం మంది మహిళలు పదవ తరగతికన్నా పైగా చదువుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement