
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ భూభాగంలో జరిగే కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన ఆహ్వానంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ నెల 28న జరగనున్న ఈ కార్యక్రమానికి పాక్ ప్రభుత్వం శనివారం సుష్మా స్వరాజ్‌ని ఆహ్వానించింది. దీనిపై సుష్మా ట్విటర్‌లో స్పందిస్తూ.. కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు తనను ఆహ్వానించినందుకు ఆ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషికి ధన్యవాదాలు తెలిపారు. కానీ, నిర్ణయించిన షెడ్యూల్ రోజున ఆ కార్యాక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు.
భారత్ తరఫున కేంద్ర మంత్రులు హర్ సిమ్రత్ కౌర్, హర్దీప్ సింగ్ పూరీలు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు ప్రకటించారు. పాక్ ప్రభుత్వం కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం వేగంగా చేపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వీలైనంత తొందరగా భారతీయులు గురుద్వార్ కర్తార్‌పూర్ సాహిబ్‌లో ప్రార్థనలు చేసేందుకు ఈ కారిడార్‌ను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.
భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికుల సౌకర్యం కోసం గుర్‌దాస్‌పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి స్పందనగా పాక్ కూడా సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది. కాగా, భారత భూభాగంలో జరిగే రహదారి నిర్మాణానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.