సుప్రీంకు, కేంద్రానికిది అప్రతిష్టే!

Supreme Court Serious On Central Over Cauvery Board Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడుకు  కావేరి జలాలను విడుదల చేసే పరిస్థితిలో లేమని కర్ణాటక ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టు ముందు చేతులెత్తేసింది. కేంద్ర జల కమిషన్‌ ఆదేశాల మేరకు ఇదివరకే తమిళనాడుకు నీటిని విడుదల చేశామని, ఇప్పుడు అదనంగా నీటిని విడుదల చేయలేమని తేల్చింది. తమకు నాలుగు టీఎంసీల నీటిని కావేరి నుంచి విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కర్ణాటక సమాధానం ఇచ్చిన తీరు ఇది. తమిళనాడుకు కావేరి జలాల విడుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడాని జలాల పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం వాటిని కేంద్రం ఖాతరు చేయక పోవడం తెల్సిందే. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేయలేక పోయామని కేంద్రం సమాధానం చెప్పుకుంది. అది వాస్తవం కాదని, ఇటీవలనే మోదీ ఆధ్వర్యంలో ఓ కేబినెట్‌ సమావేశం జరిగిన విషయం ఇటు కేంద్రానికి, అటు సుప్రీం కోర్టుకు తెలుసు. జలాల పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేయడం కర్ణాటక రాష్ట్రానికి ఇష్టం లేదు. ఇష్టంలేని పనిచేయడం ద్వారా అక్కడి ఎన్నికల్లో విజయావకాశాలను ఎందుకు దెబ్బతీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిన్నకుండింది.

ఈ విషయంలో నిర్మోహమాటంగా వ్యవహరించే సుప్రీం కోర్టు కూడా కేంద్రం సమాధానంతో సంతప్తి పడినట్లు కనిపించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది సుప్రీం కోర్టు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఈ విషయంలో కేంద్రాన్ని మందలించకుండా, నాలుగు టీఎంసీలు కుదరకపోతే రెండు టీఎంసీలనైనా విడుదల చేయడంటూ కర్ణాటకను సుప్రీం కోర్టు కోరణం శోచనీయం. ఓ రాష్ట్రంలో సానుకూల ఫలితాల కోసం పాలనా వ్యవహరాలను పక్కన పెట్టడం, చట్టాన్ని అమలు చేయకపోవడం కేంద్రంపరంగా దారుణమైన పరిణామమే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top