ఉచితంగా కరోనా పరీక్షలు

Supreme Court orders free coronavirus testing at private labs - Sakshi

వెంటనే మార్గదర్శకాలు ఇవ్వండి

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం  

న్యూఢిల్లీ: అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ లేబోరేటరీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఈ విషయంలో వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రైవేట్‌ హాస్పిటళ్లు, ల్యాబ్‌ల పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు సేవలందించడంలో దాతృత్వం చూపాలని వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలను ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, డబ్ల్యూహెచ్‌వో/ఐసీఎం ఆర్‌ అనుమతి పొందిన ల్యాబ్‌ల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షల పేరిట విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, దీన్ని అరికట్టాలని కోరుతూ అడ్వొకేట్‌ శశాంక్‌దేవ్‌ సుధీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం తాజాగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది. ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలకు ప్రజల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దోపిడీని అరికట్టాలని సూచించింది. నిర్దేశించిన దానికంటే అధికంగా వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రైవేట్‌ ల్యాబ్‌లు తీసుకున్న సొమ్మును ప్రజలకు ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాలని సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top