ప్రేమించిన యువతి కోసం మతం మార్చుకున్న యువకుడు

Supreme Court To Muslim Man Be A Great Lover - Sakshi

న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌కు చెందిన వివాదాస్పద మతాంతర వివాహ కేసు బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన బెంచ్‌ సదరు వ్యక్తిని గొప్ప ప్రేమికుడిగా.. నమ్మకమైన భర్తగా ఉండాలని అభిప్రాయ పడింది. ఆ వివరాలు.. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ హిందు యువతి, అదే ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువకుడిని ప్రేమించింది. అబ్బాయి వేరే మతస్తుడు కావడంతో యువతి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అంగీకరించలేదు. అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ వ్యక్తి వారి నమ్మకాన్ని గెల్చుకోవడం కోసం మతం మార్చుకుని హిందువుగా మారాడు. అనంతరం యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబ సభ్యులు అతడి చర్యలను అవమానకరమైనవిగా వర్ణిస్తూ.. వివాదాస్పదం చేశారు. అంతేకాక అతడి మీద చత్తీస్‌గఢ్‌ కోర్టులో కేసు కూడా నమోదు చేశారు.

సుప్రీం కోర్టులోని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కోర్టు సదరు వ్యక్తిని మతం, పేరు మార్చుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించింది. అంతేకాక మేజర్లైన ఇరువురి యువతి యువకుల ఆమోదంతో జరిగిన కులాంతర, మతాంతర వివాహాలను కోర్టు వ్యతిరేకించదని స్పష్టం చేసింది. కేవలం అమ్మాయి భవిష్యత్తు గురించి మాత్రమే కోర్టు ఆలోచిస్తుందని తెలిపింది. అంతేకాక ప్రేమించిన యువతి కోసం మతం మార్చుకోవడానికి సిద్ధపడ్డావ్‌. జీవితాంతం గొప్ప ప్రేమికుడిగా, నమ్మకమైన భర్తగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top