‘అయోధ్యలో భూసేకరణ’పై సుప్రీంలో పిటిషన్‌ 

Supreme Court To Hear Plea On Land Acquisition At Ayodhya - Sakshi

మిగతా పిటిషన్లతో కలిపి విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం 

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాస్పద ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న 67 ఎకరాల భూమిని కేంద్రం సేకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయోధ్య అంశంపై ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనానికి తాజాగా దాఖలైన ఈ పిటిషన్‌ను బదలాయిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి చెందిన మత సంబంధ స్థలాన్ని సేకరిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని రామ్‌లల్లా సంస్థకు చెందిన న్యాయవాదులు శిశిర్‌ చతుర్వేది, సంజయ్‌ మిశ్రా పేర్కొన్నారు. 

‘పార్లమెంట్‌ చర్య హిందువుల మత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. తమ పరిధిలోని మత సంస్థల వ్యవహారాల నిర్వహణలో జోక్యం చేసుకునే ప్రత్యేక అధికారాలు రాష్ట్రానికి మాత్రమే ఉన్నాయి. కేంద్రం సేకరించిన భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి’అని వారు కోరారు. వివాదాస్పదం కాని 67 ఎకరాల భూమిని యజమానులకే తిరిగి ఇచ్చి వేసేందుకు వీలుగా 2003లో ఇచ్చిన ఉత్తర్వుల సవరణకు అనుమతించాలంటూ కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో తాజాగా ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 1992లో బాబ్రీ మసీదు కట్టడాన్ని కరసేవకులు ధ్వంసం చేయడంతో 1993లో కేంద్రం ప్రత్యేక చట్టం ద్వారా వివాదాస్పద ప్రాంతం2.77 ఎకరాలతోపాటు చుట్టుపక్కల ఉన్న మొత్తం 67.703 ఎకరాలను సేకరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top