అర్ధగంట చదివినా అర్థంకాలేదు | Supreme Court to hear petitions against Article 370 | Sakshi
Sakshi News home page

అర్ధగంట చదివినా అర్థంకాలేదు

Aug 17 2019 3:51 AM | Updated on Aug 17 2019 3:51 AM

Supreme Court to hear petitions against Article 370 - Sakshi

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దును వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరిస్తూ, ఆ పిటిషన్లలో అనేక లోపాలు ఉన్నాయనీ, ముందు వాటిని సరిచేసుకోవాలని సూచించింది. ఇంతటి తీవ్రమైన, ప్రధానమైన అంశానికి సంబంధించిన పిటిషన్లలో అనేక తప్పులు, లోపాలు ఉండటంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం ఈ నెల 5న రద్దు చేయడం తెలిసిందే. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. న్యాయవాది ఎంఎల్‌ శర్మ మొట్టమొదటగా, ఆగస్టు 6నే వేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది. శర్మ పిటిషన్‌పై జస్టిస్‌ గొగోయ్‌ వ్యాఖ్యానిస్తూ ‘ఈ పిటిషన్‌ను అర్ధగంటపాటు చదివాను. కానీ ఈ పిటిషన్‌ ఎందుకు వేశారో అర్థం కాలేదు. పిటిషనర్‌ ఏం కోరుతున్నారో తెలియలేదు. ఏం అడుగుతున్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఏం పిటిషన్‌ ఇది?’ అని అన్నారు.

మరికొంత సమయం ఇస్తాం..
జమ్మూ కశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను కూడా ఇదే ధర్మాసనం విచారించింది. ఆంక్షలను క్రమక్రమంగా ఎత్తివేస్తున్నామని కేంద్రం తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ అంశంలో ఏదైనా ఆదేశం జారీ చేసే ముందు తాము మరికొంత సమయం వేచిచూడనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదిస్తూ క్రమక్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నామని చెప్పారు. ఇరు పక్షాల వాదనలనూ విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ‘ ఆంక్షల ఎత్తివేతపై కేంద్ర ప్రభుత్వానికి మేం మరికొంత సమయం ఇవ్వదలచుకున్నాం’ అని తెలిపింది.  

ఎవ్వరూ చనిపోలేదు
జమ్మూ కశ్మీర్‌లో ఆగస్టు 5న ఆంక్షలు విధించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రాణం కూడా పోలేదనీ, ఎవరికీ పెద్ద గాయాలు కాలేదని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు. కశ్మీర్‌లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్లను పునరుద్ధరించే పని శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమవుతుందనీ, శనివారం ఉదయానికే శ్రీనగర్‌లోని అత్యధిక భాగం ఫోన్లు పనిచేస్తుంటాయని ఆయన తెలిపారు. కశ్మీర్‌లో పాఠశాలలను వచ్చే వారంలో పునఃప్రారంభిస్తామనీ, దశల వారీగా ఆంక్షలను ఎత్తివేస్తామన్నారు. కశ్మీర్‌ లోయలోని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం బాగా ఎక్కువగానే హాజరు నమోదైందని సుబ్రహ్మణ్యం తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండగా, ప్రస్తుతం 12 జిల్లాల్లో ఫోన్‌ కనెక్షన్లన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయనీ, మరో ఐదు జిల్లాల్లో కేవలం రాత్రి వేళల్లోనే ఆంక్షలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. కశ్మీర్‌ లోయలో 11 రోజులు ఉన్న అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ శుక్రవారం ఢిల్లీకి తిరిగొచ్చారు. మరోవైపు కశ్మీర్‌లో ఫోన్‌లైన్లు, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు పనిచేయకపోవడంతో.. బయటి ప్రాంతాల్లోని వ్యక్తులు తమ సందేశాలను టీవీ చానెళ్లకు పంపితే, చానెళ్లు వాటిని టీవీల్లో టిక్కర్‌ (స్క్రోలింగ్‌) రూపంలో కశ్మీర్‌లోని వారికి అందిస్తున్నాయి. అయితే కశ్మీర్‌లోని వారంతా ఈ మెసేజ్‌లను టీవీల్లో చూడగలరు తప్ప తిరిగి సమాధానం పంపలేరు.  

థార్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు
థార్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా కరాచీ వెళ్లేందుకు జీరోపాయింట్‌ వరకూ నడుపుతున్న లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఈ రైలు ఆగిపోయిందని వాయువ్య రైల్వే అధికారి అభయ్‌శర్మ అన్నారు. అటునుంచి రావాల్సిన రైలు కూడా నిలిచిపోయిందని తెలిపారు.    

ట్రంప్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ ఫోన్‌
పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కశ్మీర్‌ సమస్యపై ఫోన్‌లో చర్చించినట్లు పాక్‌ విదేశాంగ మంత్రి తెలిపారు. కశ్మీర్‌ విషయంలో ఐరాసలో రహస్య భేటీ జరుగుతున్న సందర్భంగా ట్రంప్‌–ఇమ్రాన్‌ మాట్లాడుకున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement