కండక్టర్‌..నటుడు..నాయకుడు | Superstar Rajinikanth enters politics, to contest all seats in 2021 Assembly polls | Sakshi
Sakshi News home page

దేవుడు శాసించాడు!

Jan 1 2018 9:01 AM | Updated on Sep 17 2018 4:56 PM

Superstar Rajinikanth enters politics, to contest all seats in 2021 Assembly polls - Sakshi

దేవుడు శాసించడంతో సినీ  కథానాయకుడు ఆదివారం రాజకీయ నాయకుడిగా అవతరించారు. ఆధ్యాత్మిక ‘రాజకీయ’ నినాదంతో అడుగు వేశారు.బాషాగానో లేదా బాబాగానో ఏమోగానీ ఈ కబాలీ మాత్రం ‘కాలా’ అంటూ రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. కొత్త çసంవత్సర సంబరాలు కొన్ని గంటల ముందే వచ్చేశాయా అన్నట్టుగా అభిమానుల్లో  ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపారు. ట్రూత్, వర్క్, గ్రోత్‌ (నిజం, పని, అభివృద్ధి) మూల సూత్రాలుగా రాజకీయఅరంగేట్రం చేసిన సూపర్‌స్టార్‌కు అభిమానలోకం నీరాజనాలు పలుకుతున్నాయి. ఈ నాయకుడి రక్షణ సేన సంబరాల్లో మునిగారు.

సాక్షి, చెన్నై:  దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ అభిమానులు ఎక్కువే. రాష్ట్రంలో అయితే, ఆయనకున్నంత అభిమాన లోకం మరొకరికి లేదని చెప్పవచ్చు. తమ కథనాయకుడు రాజకీయాల్లో రావాలన్న ఆత్రుతతో ఏళ్ల తరబడి అభిమానులు ఎదురుచూస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా రజనీ రాజకీయ నినాదం తెర మీదకు రావడం కనుమరుగు కావడం జరిగింది. అయితే, ఐదేళ్ల క్రితం నుంచి ‘ తలై‘వా’ అంటూ రాజకీయాల్లోకి ఈ స్టార్‌ను లాగేందుకు అభిమానులు ఆందోళనల బాట పట్టకతప్పలేదు. సొంతంగా పార్టీని, జెండాను ప్రకటించుకునే స్థాయిలో  అభిమానుల్లో బయలు దేరిన ఆవేశాన్ని శాంత పరిచే రీతిలో  ‘దేవుడు శాసిస్తే...రాజకీయాల్లోకి వస్తా’ అంటూ గతంలో రజనీ మెలిక పెట్టారు. ఈ నేపథ్యంలో అమ్మ జయలలిత మరణంతో ఆమె స్థానాన్ని భర్తీ చేసే దిశలో ‘వా...వా తలైవా’ నినాదం మిన్నంటింది.

 రెండున్నర దశాబ్దాలకు పైగా దాట వేత, నాన్చుడు ధోరణి అనుసరిస్తూ వచ్చిన రజనీ కాంత్‌ ఈ సారి ఆరు రోజుల పాటు అభిమానులతో భేటీకి సిద్ధ పడడం రాజకీయ ప్రాధాన్యతకు దారి తీసింది. అదే సమయంలో రజనీ రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఊపందుకుంది. వస్తారన్న ఆశ అభిమానుల్లో ఉన్నా, ఎక్కడ మెలిక పెడతారోనన్న ఉత్కంఠ తప్పలేదు. అయితే, ఈ సారి అభిమానుల్లో నిరుత్సాహాన్ని నింపేందుకు ఈ 2.ఓ సాహసించ లేదు. ‘కాలా’ తరహాలో ముందుకు అడుగు వేశారు.  కబాలీ స్టైల్లో వచ్చేశానని చెప్పు....వచ్చేశా అంటూ రాజకీయ ఎంట్రీ ఇవ్వడం అభిమానుల్లో ఆనందోత్సాహాల్ని నింపింది.

దేవుడు శాసించాడు..ఆరో రోజు భేటీలో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ఎంట్రీ గురించి ఎలాంటి  ప్రకటన చేస్తారోనన్న ఎదురు చూపులు సర్వత్రా బయలుదేరాయి. ఐదు రోజుల పాటుగా ఎనిమిదిన్నర గంటలకే భేటీ మొదలైనా, చివరి రోజు అరగంట ఆలస్యం కాక తప్పలేదు. సమయం గడిచే కొద్ది అభిమానుల్లో ఉత్కంఠ తప్పలేదు. రజనీ సన్నిహిత మిత్రులు సైతం తరలి రావడంతో ప్రాధాన్యత పెరిగింది. ఐదు రోజులతో పోల్చితే చివరి రోజు అభిమాన సందోహం క్రమంగా రెండింతలు, నాలుగింతలు అన్నట్టుగా పెరిగింది. కోడంబాక్కం రాఘవేంద్ర కల్యాణ మండపం పరిసరాలు ఇసుక వేస్తే రాలనంతంగా కిక్కిరిశాయి. 

కథానాయకుడు ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఎదురు చూపులతో టీవీలకు అతుక్కుపోయిన వాళ్లు ఎందరో. అన్ని మీడియా చానళ్లు ప్రత్యేక ప్రసారాలకు ఏర్పాట్లు చేయడంతో తలైవా ప్రకటన కోసం అభిమాన సందోహమే కాదు, ఇతర పార్టీలకు చెందిన వారు ఆసక్తిగా వీక్షించారు. సరిగ్గా తొమ్మిది గంటల సమయంలో కల్యాణ మండపం వేదిక మీదకు వచ్చిన కథానాయకుడు తమిళ్‌ తాయ్‌(తమిళ తల్లి) గీతం తదుపరి దేవుడు శాసించాడంటూ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. ఈ క్షణం...ఆ వేదిక ముందున్న ప్రతి ఒక్కరూ పైకి లేచి నిలబడి కరతాళ ధ్వనుల్ని మార్మోగిస్తూ రాజకీయ ప్రకటనను ఆహ్వానించారు. అదే సమయంలో కోడంబాక్కం పరిసరాలు బాణసంచాల మోతతో దద్దరిళ్లాయి.

ఆహ్వానం – వ్యతిరేకత
కథానాయకుడి రాజకీయ అరంగ్రేటాన్ని ఆహ్వానించే వాళ్లు ఏ మేరకు ఉన్నారో వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. ఇక, రాజకీయ నాయకులు అయితే చెప్పనక్కర్లేదు. కొందరు అభినందించగా, మరికొందరు విమర్శలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. 

ఎవరు ఏమన్నారంటే..
 రాజకీయాలకు రజనీ రావడాన్ని ఆహ్వానిస్తూ, సోదరుడికి విశ్వనాయకుడు కమల్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

♦ రజనీ రాకతో అన్నాడీఎంకేకు ఎలాంటి ఢోకా లేదని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని తమిళనాడు సీఎం పళనిస్వామి, మంత్రులు సెల్లూరు రాజు, జయకుమార్‌ వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టినానంతరం ఆయనకు అన్నీ తెలిసి వస్తాయని పేర్కొన్నారు. 

♦ రజనీ రాకతో డీఎంకేకు ఢోకా లేదని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలు వేరని, గెలుపుబాటలో ఎలా పయనించాలో తమకు తెలుసునని, ఎందరు వచ్చినా తమకు ఢోకా లేదన్నారు. 

♦ రాజకీయ ఆహ్వానాన్ని పలికిన నటి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కుష్బు అయితే, ఇక, రజనీ వెనక్కు తగ్గకూడదని వ్యాఖ్యానించారు. ఆయనతో మార్పు అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. 

♦ రజనీ రాకతో రాజకీయ మార్పు తథ్యం అని డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఆయన ఎలాంటి సేవల్ని అయినా చేయగలరని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

♦ ప్రజల్ని గందరగోళంలో నెట్టేందుకు కొందరు నటులు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, అందులో తాజా ప్రకటన కూడా ఒకటిగా కూడంకులం అణు వ్యతిరేక ఉద్యమ నేత ఉదయకుమార్‌ విమర్శించారు. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఒకేసారి పార్టీని కూడా ప్రకటించవచ్చుగా, మరి గందరగోళం వ్యాఖ్యలు ఎందుకో అని ప్రశ్నించారు. 

♦ తమిళనాడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ందని, ఇతర రాష్ట్రాల వాళ్లు ఎగతాళి చేస్తున్నారని రజనీ వ్యాఖ్యానించడం ఏ అంశాన్ని ఉద్దేశించిందో అర్థం కావడం లేదని అన్నాడీఎంకే అమ్మ నేత, ఎమ్మెల్యే దినకరన్‌ వ్యాఖ్యానించారు. ప్రజా స్వామ్య దేశంలో రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు అని, న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమేనని పేర్కొన్నారు. 

♦ రజనీ వ్యాఖ్యల్లో కాషాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత నాంజిల్‌ సంపత్‌ వ్యాఖ్యానించారు. తమిళనాట పుట్టుకొచ్చిన పది పార్టీల్లో పదకొండో పార్టీ ఇది అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో రావడం పెద్ద విషయం కాదని, ఒడ్డుకు చేరి విజయం సాధించడం సాధరణ విషయం కాదని వ్యాఖ్యానించారు. 

♦ తమిళనాడు రక్షణ అని గళం విప్పిన రజనీ, ఇంత వరకు తమిళుల కోసం ఏమి చేశారోనన్నది ప్రకటించాలని నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ డిమాండ్‌ చేశారు. ఒకే రోజు పార్టీ ప్రకటన, అధికారం సాధ్యపడదని, రజనీని తాము వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. 

♦ రాజకీయం సరే, ఆధ్యాతిక బాటలో పార్టీ అని ప్రకటించడం గందరగోళానికి దారి తీసిం దని ద్రవిడ కళగంనేత వీరమణి విమర్శించారు. 

♦ ఎంతో ధైర్యంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రజనీకాంత్‌ను ఆహ్వానిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడురాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీకాంత్‌ రావడం ఆహ్వా నించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. 

♦ అసెంబ్లీ ఎన్నికలు సమీపించే సమయంలో పార్టీ అని ఆయన వ్యాఖ్యానించి ఉండడం ఆలోచించ దగ్గ విషయంగా> కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ వ్యాఖ్యానించారు. కొత్త సంవత్సరంలో విడుదల కాబోతున్న ఆయన చిత్రాలకు పబ్లిసిటీ స్టంట్‌గా ఈ కొత్త ప్రకటన, ప్రయత్నం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్‌ సైతం ఇదే అనుమానం వ్యక్తం చేసినా, రాజకీయాలకు వచ్చిన రజనీని ఆహ్వానించారు. తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌ కూడా రజనీకి ఆహ్వానం పలికారు. అదే సమయంలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ ఒక అడుగు ముందుకు వేసి, అసెంబ్లీ ఎన్నికల్ని తర్వాత చూసుకుందామని, లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ప్రకటన చేయండి చూద్దాం అని ఎద్దేవా చేశారు. 

♦ సీపీఎం, సీపీఐ నేతలు రామకృష్ణన్, ముత్తరసన్‌ పేర్కొంటూ, కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదని, ఆధ్యాతిక రాజకీయం వ్యాఖ్యల్లో గందరగోళం ఉందన్నారు. 

ఆధ్యాత్మిక రాజకీయం : రాజకీయ ప్రకటన సమయంలో రజనీకాంత్‌ ప్రసంగం సరికొత్త బాణీలో సాగింది. ఎవర్నీ విమర్శించకుండా, వేలు ఎత్తి చూపకుండా తమిళనాడును రక్షించుకోవడం లక్ష్యంగా , తమిళ సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాజకీయ కదన రంగంలో దిగుతున్నట్టు ప్రకటించడం అభిమానుల్ని ఆనందసాగరంలో ముంచింది. ట్రూత్, వర్క్, గ్రోత్‌ (నిజం, పని, అభివృద్ధి) సూత్రాలుగా, ప్రజా స్వామ్య వ్యవస్థలో నిజాయితీ, జవాబుదారీ తనం ఉండాలని కాంక్షిస్తూ రజనీ సాగించిన ప్రసంగాన్ని ఆహ్వానించే విధంగా అభిమానుల్లో కరతాళ ధ్వనుల్ని మార్మోగాయి. తమిళనాట బ్రష్టు పట్టిన వ్యవస్థకు చికిత్స చేయడం లక్ష్యంగా, దోపిడీ దారుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు ఓ కేడర్‌గా కాకుండా, రక్షకులుగా ముందుకు రావాలని నాయకుడు ఇచ్చిన పిలుపునకు తాము సిద్ధం అని అభిమాన లోకం నినదించడం విశేషం.

సంబరాల్లో అభిమాన సేన : కథానాయకుడి రాజకీయ ప్రకటనతో ఒక్కసారిగా కోడంబాక్కం పరిసరాలు మార్పును సంతరించుకునేలా చేశాయి. రజనీకాంత్‌ ఫొటోలు, స్టిక్కర్లతో దుకాణాలు వెలిశాయి. గతంలో అభిమానులు పరిచయం చేసిన జెండాలు సైతం విక్రయాలకు పెట్టడంతో వాటిని చేత బట్టి అభిమానులు విజయపు నినాదాల్ని మార్మోగించారు. ఇక, రాష్ట్రంలో అయితే, అభిమాన లోకం సంబరాల్లో మునిగింది. రజనీకి అభిమాన సంఘం అంటూ తొలుత ఏర్పాటు చేసిన మదురై నగరం బాణసంచాల మోతతో మార్మోగింది. రోడ్డు మీదకు వచ్చిన అభిమానులు ఆనందోత్సాహాలతో తాండవం చేశారు.  ప్రజల్ని రక్షించేందుకు, రజనీకి అండగా నిలబడేందుకు రక్షకులుగా తాము నిలబడతామని నినదిస్తూ కేరింతలు కొట్టారు. రజనీరాకతో ఇక, రాష్ట్రానికి మంచి రోజులేనని నినదించే వాళ్లు మరి కొందరు. కొత్త సంవత్సరం వేళ సరికొత్త కానుకే కాదు, తమిళనాడు మార్పునకు వేదికగా ఈ రాజకీయ ప్రకటన అని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన అభిమానులూ ఎక్కువే. రెండున్నర దశాబ్దాల నిరీక్షణ, ఎదురుచూపులు  ఫలించాయని, లేటుగా వచ్చినా సరికొత్తగా తమిళనాట మార్పును తమ నాయకుడు తీసుకొచ్చి తీరుతాడని ధీమా వ్యక్తం చేసే వాళ్లు మరీ ఎక్కువే. 

కండక్టర్‌..నటుడు..నాయకుడు
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారే. కండక్టర్‌ నుంచి ప్రపంచం మెచ్చే స్టార్‌గా ఎదిగి, తమిళనాట నాయకుడిగా అవతరించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, జీవితంలో సుఖాలు తప్పదు. ఈ రెండింటి కలబోత రజనీ. మహారాష్ట్రలో జన్మించి, బె ంగళూరులో బతుకు జీవన పయనంలో కండక్టరుగా ముందుకు సాగిన ఈ సామాన్యుడు తమిళనాటే కాదు, ప్రపంచ దేశాల్లో అశేషాభిమాన లోకాన్ని కల్గి ఉన్నారు. ఓ మిత్రుడి సాయంతో మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి అపూర్వరాగంగళ్‌తో సినీ అరంగ్రేటం చేసి కాలా వరకు జనాన్ని తన దైన స్టైల్లో మెప్పించిన ఈ స్టార్‌ తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు రక్షణ నినాదంతో రాజకీయాల్లో సత్తా చాటేందుకు అడుగులు వేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలన్నది నిన్న మొన్నటి నినాదం కాదు. ఏకంగా రెండున్నర దశాబ్దాలుగా తెర మీద ఉన్న పిలుపే. 

 ప్రతిసారి ఎన్నికల సమయంలో ఆయన సంకేతం మీద అభిమాన లోకం దృష్టి పెట్టడం జరిగేది. ఆ దిశగా 1996లో జయలలిత మళ్లీ సీఎం అయితే, తమిళనాడును దేవుడు కూడా రక్షించలేరని ఆయన చేసిన వ్యాఖ్య డీఎంకే – తమిళ మానిల కాంగ్రెస్‌ కూటమికి బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే డిపాజిట్లు ఆ సమయంలో గల్లంతు అయింది. మరోమారు లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా పరోక్ష సంకేతాన్ని ఇచ్చి బోల్తా పడ్డారు. ఫలితం తిరకాసు కావడంతో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టు పయనాన్ని సాగించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల ముందు తలైవా నినాదం మిన్నంటినా దాటవేత, నాన్చుడు ధోరణి అనుసరించారు.

 ఆ ఎన్నికల సమయంలో రజనీ వ్యాఖ్య సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా స్పందించినందుకు చింతిస్తున్నట్టు వ్యాఖ్యలు చేసి, పరోక్షంగా అన్నాడీఎంకే అధికారానికి బాట వేశారు. ప్రస్తుతం అమ్మ జయలలిత మరణంతో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయన అరంగ్రేటానికి దారి తీశాయని చెప్పవచ్చు. తొలుత రాజకీయ ప్రవేశం గురించి రజనీ ఆలోచించినట్టున్నారు. నిజానికి రాజకీయాల్లోకి రావడానికి తొలుత మొగ్గు చూపని రజనీ, తమిళనాడు రక్షణ నినాదంతో యుద్ధంలో దిగి గెలుపు లక్ష్యంగా దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement