కూలిన ఫ్లై ఓవర్‌.. ఒకరి మృతి

South Kolkata Majerhat Bridge Collapses - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని మాజెర్‌హత్‌ ఏరియాలో ఉన్న ఫ్లై ఓవర్‌ కుప్ప కూలింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ ఘటనతో కొన్ని వాహనాలు ఫ్లై ఓవర్‌ కింద ఇరుక్కుపోయాయి. వీరిని రక్షించేందుకు 10 రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లై ఓవర్‌ పూర్తిగా కూలిపోయే అవకాశం ఉన్నందున సమీపంలోని ఇళ్లను కూడా ఖాళీ చేయిస్తున్నారు.  

బాధాకరమైన విషయం : మమతా బెనర్జీ
రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఫ్లై ఓవర్‌ కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రస్తుతం డార్జిలింగ్‌ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈరోజు(మంగళవారం) డార్జిలింగ్‌ నుంచి కోల్‌కతాకు విమానాలు లేనందున ఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్నాని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్షతగాత్రులను కాపాడటమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కాగా రెండు సంవత్సరాల క్రితం కోల్‌కతాలోని వివేకానంద ఫ్లై ఓవర్‌ కూలిపోవడంతో 20 మంది మృతి చెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top