ఎవరి అభిప్రాయం వారిది : సోనూసుద్‌

Sonu Sood on Sanjay Raut Criticism About Helping Migrants In Lockdown - Sakshi

ఢిల్లీ : లాక్‌డౌన్‌ వేళ అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికుల పట్ల నటుడు సోనూసుద్ తన ఉదారభావాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపిన సోనూ.. వారి పట్ల రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే సోనూసుద్‌ చేస్తున్న ఈ సాయంపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ అంటూ ఆరోపించారు. లాక్‌డౌన్ వేళ కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చారంటూ సోనూపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలపై సోనూసుద్‌ స్పందించారు.
(విమర్శలకు చెక్‌: సీఎంతో భేటీ)

'ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. అది అతని అభిప్రాయం. వయసులో ఆయన పెద్ద మనిషి.. అందులోనూ ఎవరి నిర్ణయం వారికి ఉంటుంది. రౌత్‌ వ్యాఖ్యల పట్ల కాలమే సమాధానం చెబుతుందని భావిస్తున్నా. త్వరలోనే ఈ విషయన్ని సంజయ్‌ రౌత్‌ గ్రహిస్తారు. రౌత్‌ చేసిన వ్యాఖ్యలను మాత్రం సమర్థించను. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను. ఒక యాక్టర్‌గా బిజీ లైఫ్‌ను గడుపుతున్నాను. నా జీవితంలో సినిమా కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎవరో ఏదో అన్నంత మాత్రానా పని గట్టుకొని విమర్శలు చేయడం నాకు ఇష్టం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం.. ఎవరు ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది.. సమాజంలో మంచి చేసే పనులపై విమర్శించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. నా ఊపిరి ఉన్నంతవరకు సినిమాల్లోనే కొనసాగుతా. రాజకీయాలంటే నాకు ఆసక్తి లేదు. ఈ సందర్భంగా శివసేన నేతలు ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రేలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వాళ్లను నా స్నేహితులుగా భావిస్తున్నా.. ఎందుకంటే కష్ట సమయంలో వారు నాకు సహాయం చేశారు. అయితే  నా దృష్టిలో వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయిన వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం.. అదే నా ఆశ' అని చెప్పుకొచ్చారు. (సోనూసుద్‌కు రాజకీయ రంగు)


కాగా ఆదివారం సోనూసుద్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిశారు. ఈ సమావేశంలో ఉద్ధవ్ థాకరే తనయుడు, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై మాట్లాడుకోగా.. సోనూపై ఉద్ధవ్ థాకరే ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంపై సోనూసుద్‌ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే థాకరేను కలిశానని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top