అయ్యో..ఎంతకష్టమొచ్చింది తల్లీ! | Son Leaves Mother on Road in Tamil Nadu | Sakshi
Sakshi News home page

అయ్యో..ఎంతకష్టమొచ్చింది తల్లీ!

Oct 4 2019 7:42 AM | Updated on Oct 4 2019 7:42 AM

Son Leaves Mother on Road in Tamil Nadu - Sakshi

అనా«థలా రోడ్డుపై పట్టమ్మాళ్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై:  పదినెలలు మోసింది. పాలిచ్చి పెంచింది. చదువులు చెప్పించి జీవితంలో స్థిరపడేలా చేసింది ఆ తల్లి. అయితే కిరాతక కుమారులిద్దరికీ ఆమె  మోయలేని భారమైంది. 95 ఏళ్ల వృద్ధా్దప్యంతో జీవత చరమాంకానికి చేరుకున్న కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా గెంటివేశారు. అమ్మ విలువ తెలియని కుమారులిద్దరూ కూడబలుక్కుని అర్ధరాత్రివేళ నడిరోడ్డుపై పడేసి తలుపులేసుకున్నారు. మానవత్వంలేని కుమారులను తలుచుకుని కన్నీళ్ల పర్యంతమైన ఆ తల్లి వారికోసం ఇంకా తపిస్తూ ఆసుపత్రికి చేరుకున్న దయనీయమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  అరియలూరు జిల్లా జయంకొండం సమీపం సెంగునందపురానికి చెందిన మాణిక్యం, పట్టమ్మాళ్‌ (95) దంపతులకు షణ్ముగం (62), సదాశివం (59) అనే ఇద్దరు కుమారులు, సరోజ (65), శకుంతల (60) అనే ఇద్దరు కుమార్తెలున్నారు.  పెద్ద కుమారుడు షణ్ముగం ఒక దుకాణాన్ని నడుపుతూ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారుడు సదాశివం ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైరయ్యాడు. భర్త మాణిక్యం ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో పట్టమ్మాళ్‌ తన పెద్దకుమారుడు షణ్ముగం ఇంటిలో ఉండేది.

వృద్దాప్యం మీదపడుతున్నా చేనేత పనిచేస్తూ కుమారుడికి ఆర్థికంగా సహకరించేది. ఆ తరువాతి కాలంలో తీవ్రమైన అనారోగ్యానికి గురైన స్థితిలోనూ బంకును నడుపుతూ సంపాదించేది. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఇద్దరు కుమారులూ కూడబలుక్కుని వృద్ధా్దశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నారు.   అనా«థశ్రమంలో ఉండలేకపోయిన పట్టమ్మాళ్‌ వడలూరులోని ఆశ్రమంలో చేరింది. అయినా కన్నపేగు మమకారంతో తీవ్రవృద్ధా్దప్యంతో బాధపడుతూనే సెంగునందపురంలో పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్న కుమారుల వద్దకు ఒంటరిగా చేరుకుంది. కుమారులు చేరదీస్తారని ఎంతో ఆశగా వచ్చిన ఆమెకు నిరాశేమిగిలింది. అనేకసార్లు తలుపు తట్టగా కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన కుమారులు ‘నీవెందుకు ఇక్కడికి వచ్చావు..అని కసురుకుని మరలా తలుపులకు గడియపెట్టుకున్నారు. ఇక చేసేది లేక ఇలయూరులోని కుమార్తె శకుంతల ఇంటికి చేరుకుంది. కాగా కొన్నినెలల క్రితం శకుంతల తీవ్ర అనారోగ్యానికి గురికావడం, ఆమె భర్త శివగురునా««ధం కూడా 70 ఏళ్ల వృద్ధా్దప్యానికి చేరుకోవడంతో భార్య, అత్త యోగక్షేమాలు చూసుకోలేక పోయాడు.

దీంతో శకుంతల భర్త శివగురునాథన్‌ బుధవారం ఆమెను వెంటబెట్టుకుని కుమారులు ఇళ్లకు వెళ్లాడు. అయితే ఇద్దరు కుమారులు ఆమెను లోనికి రానీయలేదు. దీంతో ఏమీచేయాలో పాలుపోని శివగురునాథన్‌ పెద్ద కుమారుని ఇంటి అరుగుపై ఆమెను పడుకోబెట్టి వెళ్లిపోయాడు. ఇది గమనించిన షణ్ముగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ్ముడు సదాశివం ఇంటి అరుగుపై పడుకోబెట్టి తలుపేసుకున్నాడు. సదాశివం సైతం కోపగించుకుని తిరిగి ఆమెను అన్న షణ్ముగం ఇంటి అరుగుపెట్టి వెళ్లిపోయాడు. ఇలా సోదరులిద్దరూ ఆమెను పదేపదే మారుస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేశారు. ఇక లాభం లేదనుకున్న సోదరులిద్దరూ కూడబలుక్కుని బుధవారం అర్ధరాత్రి వేళ తల్లి పట్టమ్మాళ్‌ను తమ ఇంటి ముందు నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. వృద్ధా్దప్యంతో కదలలేని స్థితిలో చలితో వణుకుతూనే రాత్రంతా రోడ్డుపైనే ఆమె గడిపారు. ఏదో ఊరికి వెళ్లి గురువారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వెళుతూ రోడ్డుపై పడి ఉన్న పట్టమ్మాళ్‌ను పన్నీర్‌సెల్వం అనే వ్యక్తి గమనించి జయకొండం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. కొద్దిగా కోలుకున్న పట్టమ్మాళ్‌ను తిరిగి ఆటోలో ఎక్కించుకుని వచ్చి కుమారులిద్దరినీ పిలిచి స్థానికులతో కలిసి చర్చలు జరిపాడు. అయితే అమ్మను ఇంట చేర్చుకునే ప్రసక్తేలేదని ఖరాఖండీగా చెప్పి వెళ్లిపోయారు. దీంతో ప్రజలు ఒక అంబులెన్స్‌ను పిలిచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుమారులిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement