క్వారంటైన్‌లో విషాదం; చిన్నారి మృతి

Snakebite kills Six Year Old Girl in Uttarakhand Guarantine Centre - Sakshi

నైనిటాల్‌: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. క్వారంటైన్‌లో ఉన్న ఆరేళ్ల బాలిక పాము కాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని తలిసేథి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న బాలిక సోమవారం ఉదయం పాము కాటుకు గురైం‍ది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చిన్నారిని బెతల్‌ఘాట్‌ కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఆమెకు వైద్యులు రెండు విషపు విరుగుడు ఇంజెక్షన్లు ఇచ్చారు. పది నిమిషాల తర్వాత చిన్నారి ప్రాణాలు వదిలింది. (లాక్‌డౌన్‌: తొలి ఐదు వారాలు చితక్కొట్టారు!)

ఈ ఘటనపై నైనిటాల్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ సవిన్‌ బన్సల్‌ తీవ్రంగా స్పందించారు. బాలిక బంధువు ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించారు. విధుల్లో ఉన్న ముగ్గురు అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో స్కూల్‌ టీచర్‌ కరణ్‌ సింగ్‌, రెవెన్యూ అధికారి(పట్వారీ) రాజ్‌పాల్‌ సింగ్‌, గ్రామాభివృద్ధి అధికారి ఉమేశ్‌ జోషిలపై స్థానిక నాయబ్‌ తహసీల్దార్‌(రెవన్యూ పోలీసు) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముగ్గురు అధికారులపై ఐపీసీ 304ఏ, 188, 269, 270, విపత్తు నిర్వహణ చట్టం 51బీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. బాలిక కుటుంబానికి రూ. 3 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్టు డివిజినల్‌ అటవీశాఖ అధికారి(డీఎఫ్‌ఓ) బిజులాల్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన వసతులు లేవని ఉత్తరాఖండ్‌ ప్రతిపక్ష నాయకుడు ఇందిరా హృదయేశ్‌ ఆరోపించారు. (కేఈఎమ్‌ ఆస్పత్రిలో మరో దారుణం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top