లాక్‌డౌన్‌: పోలీసు దెబ్బలతో 12 మంది మృతి!

Lockdown Police Excesses For Violations Lead To 12 Deaths In India - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లోకొచ్చిన తొలినాళ్లలో పోలీసుల అత్యుత్సాహం వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారని ఓ ఎన్‌జీఓ అధ్యయనంలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదనే కారణంతో పోలీసులు వారిని చితక్కొట్టారని, తీవ్ర గాయాలతో ఆ అభాగ్యులు మృతి చెందారని కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిషియేటివ్‌ (సీహెచ్‌ఆర్‌ఐ) అధ్యయనం తెలిపింది. కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా తొలి ఐదు వారాలు పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేశారని, ఆ క్రమంలో కొన్ని చోట్ల మితిమీరి ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. పోలీసు చర్యలతో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దేశవ్యాప్తంగా 12 మరణాలు సంభవించాయని వెల్లడించింది. వారిలో ముగ్గురు పోలీసులు కొట్టారనే అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపింది. మీడియా కథనాల ఆధారంగా ఈ వివరాలు సేకరించామని సీహెచ్‌ఆర్‌ఐ పేర్కొంది.

మరణించిన వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు చొప్పున, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు సీహెచ్‌ఆర్‌ఐ హెడ్‌ దేవికా ప్రసాద్‌ తెలిపారు. దీనికి సంబంధించి జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని, బాధ్యులపై చర్యలకు విజ్ఞప్తి చేశామని అన్నారు. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ మరణాలకు కారణమైనవారిని సస్పెండ్‌ చేయడమో.. బదిలీ చేయడమో చేశాయని దేవికా వెల్లడించారు. కానీ, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ మరణాలతోపాటు లాక్‌డౌన్‌ సమయంలో ఇతర కారణాలతో అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు కూడా మరణించారని దేవికా తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top