‘ఇక్కడ లంచాలు కామన్‌.. 3 లక్షలు ఉంటే చాలు’

SHO Suspended In UP After WhatsApp Chat Goes Viral - Sakshi

మీరట్‌, ఉత్తరప్రదేశ్‌ : ప్రభుత్వం, ఉన్నతాధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించాడంటూ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను(ఎస్‌హెచ్‌ఓ)ను సస్పెండ్‌ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పరశురామ్‌ అనే వ్యక్తి బదిలీలో భాగంగా నోయిడాలోని దిబాయ్‌ పోలీస్‌ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమితుడయ్యాడు. అయితే ఇలా కోరుకున్న చోట పోస్టింగ్‌ పొందేందుకు తాను ఉన్నతాధికారులకు లంచం ఇచ్చానంటూ పరశురామ్‌ చేసిన వాట్సాప్‌ చాట్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఓ గుర్తు తెలియని వ్యక్తితో చాట్‌ చేసిన పరశురామ్‌..‘ భయ్యా ఇది యోగి ప్రభుత్వం. ఇక్కడ లంచాలు ఇవ్వడం, తీసుకోవడం కామన్‌. నేను కూడా నా ట్రాన్స్‌ఫర్‌ కోసం ఏడీజీకి 50 వేల రూపాయలు ఇచ్చానంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా బులంద్‌షహర్‌ ఎస్‌ఎస్‌పీ గురించి చెబుతూ... ‘డబ్బులెవరైనా నేరుగా తీసుకుంటారా చెప్పు. ఆయన కూడా అంతే. నా ట్రాన్స్‌ఫర్‌ కోసం ఆయనకు 3 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సి వచ్చిందంటూ’  పరశురామ్‌ అవతలి వ్యక్తికి మెసేజ్‌ పంపించాడు.

అవన్నీ అవాస్తవాలు..
పరశురామ్‌ చాట్‌ వైరల్‌ కావడంతో తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉన్నతాధికారులు స్పందించారు. బులంద్‌షహర్‌ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ... కేవలం తమ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే పరశురామ్‌ ఇలా వ్యవహరించాడని తెలిపారు. అధికారులను కేవలం ఒక రేంజ్‌ నుంచి మరొక రేంజ్‌కు బదిలీ చేసే అధికారం మాత్రమే తనకు ఉంటుం‍దని పేర్కొన్న ఆయన.. పరశురామ్‌ను బదిలీ చేసింది ఐజీ అని తెలిపారు. కాగా పరశురామ్‌ను సస్పెండ్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top