తిరుమల నాయకర్‌ను కించపరస్తూ వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తెలుగుజాతి గౌరవానికి తార్కాణమైన తిరుమల నాయకర్‌ను కించపరస్తూ వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ నేతగా హుందాగా వ్యవహరించాల్సిన సీమాన్ చౌకబారు విమర్శలతో ప్రాచుర్యం పొందాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతం లో వడివేలు హీరోగా నటించిన తెనాలి రామన్ చిత్ర వ్యవహారంలో సైతం సీమాన్ తలదూర్చి తెలుగువారి పట్ల పరుషపదజాలాన్ని ప్రయోగించారని గుర్తు చేశారు.
ఆ సమయంలో తెలుగు సంఘాలన్నీ ఏకమై ఆయనకు తగిన బుద్ధి చెప్పిన విషయాన్ని మరచినట్లు ఉన్నారని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రముఖుడిగా వెలుగొందాలని ఆశిస్తే తెలుగువారు చేష్టలుడిగి ఊరుకోరని హెచ్చరించారు. నడిగర్ ఎన్నికల ప్రచారంలో తెలుగువారి పట్ల దూషణలు చేయడం గమనిస్తే ఇది పథకం ప్రకారం సాగుతోందన్న భావన కలుగుతోందని అన్నారు.
ముఖ్యమంత్రి జయలలిత పాలనలో తెలుగువారు సంతోషంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కాలరాస్తున్న సీమాన్ వంటి దుష్టశక్తులను వెంటనే కటకటాల వెనక్కి నెట్టాలని కోరారు. సీఎం, డీజీపీ, రాష్ట్ర గవర్నర్‌కు సీమాన్ విషయమై వినతిపత్రాలు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం తగినరీతిలో స్పందించకుంటే తెలుగు సంఘాలన్నీ ఏకమై తెలుగుద్రోహులకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.