ఇంట్లోనూ సురక్షితంగా లేరు | SC slams authorities on failure to curb pollution in Delhi-NCR | Sakshi
Sakshi News home page

ఇంట్లోనూ సురక్షితంగా లేరు

Nov 5 2019 3:34 AM | Updated on Nov 5 2019 3:34 AM

SC slams authorities on failure to curb pollution in Delhi-NCR - Sakshi

సోమవారం ఆగ్రాలో తాజ్‌మహల్‌ వద్ద మాస్కులతో విదేశీ పర్యాటకులు

న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సుప్రీంకోర్టు మండిపడింది. తీవ్రమైన కాలుష్యంతో ప్రజలు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, వారి ఆయుర్దాయం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, దీపక్‌ గుప్తాలతో కూడిన డివిజన్‌ ఇలాంటి వాతావరణంలో మనుషులెవరైనా జీవించగలరా అని ప్రశ్నించింది. ప్రజలు ప్రాణాలు కోల్పేయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైనది కాదని మండిపడింది. ఇళ్లల్లో సురక్షితంగా లేకపోవడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజల జీవించే హక్కుని కాలరాసినట్టేనని ఘాటుగా విమర్శించింది. ఈ పరిస్థితి కంటే ఎమర్జెన్సీ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయని జస్టిస్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.  

రాష్ట్ర ప్రభుత్వాలూ బాధ్యత వహించాలి
పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లు పంట వ్యర్థాలను కాల్చడం నిలిపివేయాలని ఆదేశించింది. పంట వ్యర్థాలు తగులబెట్టడమే కాలుష్యానికి కారణమైతే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ పంచాయతీల వరకు అందరూ బాధ్యత వహించాలని పేర్కొంది. బాధ్యత వహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల గిమ్మిక్కుల మీద ఉన్న శ్రద్ధ మరి దేని మీద లేదని విమర్శించింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో అన్ని రకాల నిర్మాణాలను, కూల్చివేతలను, చెత్తను కాల్చడాన్ని తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

పర్యావరణ నిపుణుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని సుప్రీం ఆదేశంతో కోర్టుకు హాజరైన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) చైర్మన్‌ భూరేలాల్‌ పొరుగు రాష్ట్రాల్లో తగలబెడుతున్న పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోందని ఆయా రాష్ట్రాల ప్రధానకార్యదర్శులని పిలిచి మాట్లాడాలని సూచించారు.  నాలుగైదు రోజులతో పోల్చి చూస్తే ఢిల్లీలో కాలుష్యం కాస్తో కూస్తో తగ్గింది. కానీ గాలి నాణ్యత సూచీ మాత్రం తీవ్రస్థాయిలోనే ఉంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచి 438కి తగ్గింది. అయినప్పటికీ ఈ కాలుష్యాన్ని తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది.

కారు పూల్‌లో సీఎం
ముఖ్యమంత్రి కేజ్రీవాల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, కార్మిక మంత్రి గోపాల రాయ్‌తో కలిసి కారు పూల్‌ విధానంతో ఒకే కారులో సచివాలయానికి వచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తన ఇంటి నుంచి సైకిల్‌పై సెక్రటేరియెట్‌కి వచ్చారు. కాగా, బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ విజయ్‌ గోయెల్‌ సరిబేసి కార్ల ప్రయాణం నిబంధనల్ని అతిక్రమించారు. సోమవారం సరి సంఖ్యలో ఉన్న కార్లను మాత్రమే బయటకు తీసుకురావాలి. కానీ గోయెల్‌ బేసి సంఖ్యలో ఉన్న కారులో ప్రయాణించడంతో పోలీసులు ఆయనను ఆపి రూ.4వేల జరిమానా విధించారు. ఈ కార్ల విధానాన్ని తప్పుపట్టిన గోయెల్‌ ఇదంతా కేజ్రివాల్‌ చేస్తున్న ఎన్నికల స్టంట్‌ అని వ్యాఖ్యానించారు.

బాబోయ్‌ ఢిల్లీలో షూటింగ్‌
ఢిల్లీలో షూటింగ్‌ చేయడం అత్యంత కష్టంగా మారిందని బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాలుష్యంలో అందరూ ఎలా ఉంటున్నారో ఆలోచిస్తే దడ పుడుతోందన్నారు. ‘వైట్‌ టైగర్‌’ షూటింగ్‌ కోసం ఢిల్లీలో ఉన్నపుడు తన ముఖానికి మాస్క్‌ ధరించిన ఫొటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ముఖం అంతా కప్పి ఉంచే మాస్క్‌లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు ఉండటంతో మనం బతికిపోయాం. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో నిలువ నీడ లేని వారి పరిస్థితి ఏమిటి ? ఢిల్లీవాసులందరూ సురక్షితంగా ఉండాలని అందరూ ప్రార్థించండి’ అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు.  

మాస్క్‌తో ప్రియాంక చోప్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement