ఆర్‌బీఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

SC Issues Notice To RBI Centre On Plea Against Charging Interest On Loans - Sakshi

చక్ర వడ్డీ వసూలు రాజ్యాంగ విరుద్ధం

సాక్షి, న్యూఢిల్లీ : మారటోరియం​ వ్యవధిలో పేరుకుపోయిన రుణ వాయిదాల(ఈఎంఐ)పై బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియంను ఆగస్ట్‌ 31 వరకూ ఆర్‌బీఐ పొడిగించిన అనంతరం ఈ పిటిసన్‌ దాఖలైంది. ఆర్‌బీఐ తొలుత రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్‌ తరపు వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ రాజీవ్‌ దత్తా పేర్కొన్నారు.

కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు ఉపశమనం​ అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో​ నడ్డివిరచరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం అన్యాయమని దత్తా ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండంగా మారటోరియం సమయంలో చెల్లించని రుణ వాయిదాలపై వడ్డీ భారం మోపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

చదవండి : ఆర్‌బీఐకి చిదంబరం కీలక సూచన

కరోనా వైరస్‌ సంక్షోభంతో వివిధ రంగాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులను జీతం చెల్లించకుండా యాజమాన్యాలు సెలవుపై వెళ్లాలని కోరాయని గుర్తుచేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top