ఆరావళిలో 31 కొండలు మాయం

SC concerned about 31 'missing' hills in Rajasthan, sees link to Delhi air - Sakshi

మైనింగ్‌ ఆపేయాలని సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ఆరావళి పర్వత శ్రేణిలో 31 కొండలు అదృశ్యం కావడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం, ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న అక్కడి మైనింగ్‌ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఆరావళి పర్వత శ్రేణిలో కొనసాగుతున్న గనుల తవ్వకంపై రాజస్తాన్‌ ప్రభుత్వం అందజేసిన స్టేటస్‌ రిపోర్ట్‌ను పరిశీలించిన జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశీలన ప్రకారం దాదాపు 31 కొండలు మాయమైనట్లు తేలింది. మైనింగ్‌తో ఏడాదికి రూ.5వేల కోట్ల రాబడి వస్తున్నందున ఢిల్లీలోని లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయడం సరికాదని వ్యాఖ్యానించింది. కొండలను తవ్విపోస్తుండటంతో దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం పెరిగిపోయిందని పేర్కొంది. ఇందుకు కారణమైన 115.34 హెక్టార్లలో మైనింగ్‌ కార్యకలాపాలను 48 గంటల్లోగా నిలిపివేయాలని ఆదేశించింది. ఆరావళి పర్వత శ్రేణి పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.

‘దాదాపు 31 కొండలు మాయమయ్యాయి. దేశంలో కొండలు ఇలా మాయమైతే ఏమవుతుంది? హనుమాన్‌ మాదిరిగా ప్రజలు కొండలను ఎత్తుకుపోతున్నారా? రాష్ట్రంలోని 15 నుంచి 20 శాతం కొండలు కనిపించకుండా పోయాయి. ఇది కాదనలేని వాస్తవం. దీనికి బాధ్యత ఎవరిది?’ అని ధర్మాసనం రాజస్తాన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top