పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఒక ఆర్మీ స్కూలుపై తాలిబన్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రముఖ పాఠశాలలు..
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఒక ఆర్మీ స్కూలుపై తాలిబన్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రముఖ పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు సహా దాడులకు ఆస్కారం ఉన్న సంస్థల భద్రతపై పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలను కేంద్రం త్వరలోనే జారీచేయనుంది. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన పక్షంలో పిల్లలు ప్రాణాలతో తప్పించుకునేందుకు తగిన ప్రణాళిక రూపొంచుకోవాలని, దుండగులు విద్యార్థులను బందీలుగా పట్టుకోకుండా నివారించడం, అత్యవసర పరిస్థితిలో బిగ్గరగా కేకలు వేసి పరిస్థితి తీవ్రతను తెలియజేయడం వంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం తన మార్గదర్శక సూత్రాలద్వారా కోరనుంది.
దేశం ఉత్తరాదిలోని రెండు బోర్డింగ్ స్కూళ్లు, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ లక్ష్యాలుగా, పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు దిగవచ్చని ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ, అతని అనుచరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా ఇంటరాగేషన్‌లో చెప్పినట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్గదర్శ సూత్రాల జారీచేయబోతోంది. గతంలో ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రధాన నిందితుడు హెడ్లీ 2010లో అమెరికాలో అరెస్టయినపుడు కూడా భద్రతపై స్కూళ్లకు మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు.