ఆ కమిటీ నుంచి ప్రజ్ఞా తొలగింపు

Sadhvi Pragya out of defence panel after calling Nathuram Godse a patriot - Sakshi

గాడ్సే వ్యాఖ్యలపై రాజకీయ కలకలం

న్యూఢిల్లీ: గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని లోక్‌సభ సాక్షిగా దేశభక్తుడని కొనియాడిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యలపై బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెను రక్షణ సంప్రదింపుల కమిటీ నుంచి తొలగిస్తున్నట్టుగా పార్టీ కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. ఈ దఫా పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.  

పార్లమెంటులో దుమారం  
ప్రజ్ఞా గాడ్సే వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు మండిపడ్డాయి. ఆరెస్సెస్, బీజేపీ మనసులో ఉన్న మాటలనే ప్రజ్ఞా బయటకు చెప్పిందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తింది. స్పీకర్‌ ఆమె వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు. ఇక దీనిపై సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, లెఫ్ట్‌ పార్టీలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

ప్రజ్ఞా ఒక ఉగ్రవాది: రాహుల్‌  
అంతకు ముందు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా ప్రజ్ఞాపై విరుచుకుపడ్డారు. ఆమెని ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ‘ఒక ఉగ్రవాదైన ప్రజ్ఞా మరో ఉగ్రవాది గాడ్సేని దేశభక్తుడని చెబుతోంది. భారత పార్లమెంటులోనే ఇదో దుర్దినం. ఆమె వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్‌ అసలు సిసలు ఆత్మని ఆవిష్కరిస్తున్నాయి’ అని ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రజ్ఞాను జాతి క్షమించదని ఆమెను బీజేపీ ఎప్పుడు పార్టీ నుంచి తరిమేస్తుందని ప్రశ్నించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top