కర్ణాటకలో రూ.10వేల కోట్ల నిధులతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
బెంగళూరు : కర్ణాటకలో రూ.10వేల కోట్ల నిధులతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మంగళవారం జరిగిన రహదారుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ... కర్ణాటకలోని 1,572 కిలోమీటర్ల పరిధిలోని రహదారులను రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ నిధులను కర్ణాటకకు కేటాయించినట్లు చెప్పారు. ముంబై-పూణె తరహాలో బెంగళూరు-చెన్నై రహదారిని ఎక్స్‌ప్రెస్ హైవేగా అభివృద్ధి చేయడంపై చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇదే సందర్భంలో లోక్‌సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలనే ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోంది తప్ప, ఇందులో కొత్త పథకాలేవీ లేవని అన్నారు. అందువల్ల యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను వచ్చే మూడు, నాలుగేళ్లలో పూర్తి చేయాలని నితిన్ గడ్కరీని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, జి.ఎం.సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.