
మంచువర్షంలో రిపబ్లిక్ డే వేడుకలు
దేశరాజధాని నగరం న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
విపరీతమైన మంచు వర్షం నడుమ దేశరాజధాని నగరం న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోదీ అమర సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో కలిసి రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. కాసేపటి తర్వాత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంచు దాదాపు వర్షంలా కురుస్తుండటంతో ముఖ్య అతిథులతో పాటు దాదాపు వేడుకలకు హాజరైనవాళ్లంతా గొడుగులు పట్టుకునో, తలపై పుస్తకాలు పెట్టుకునో ఉండక తప్పలేదు. పెరేడ్ మార్గం కూడా మొత్తం మంచుతో తడిసిపోయింది.
అనంతరం అత్యున్నత సైనిక పురస్కారమైన అశోకచక్రను దివంగత సైనికాధికారుల భార్యలకు అందించారు. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందూ ముకుంద్కు అశోకచక్రను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించారు. అనంతరం దివంగత నాయక్ నీరజ్కుమార్ సింగ్ భార్య పరమేశ్వరీ దేవికి కూడా అశోకచక్రను బహూకరించారు.