
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త రూ.2000, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది. పాత రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొనసాగిస్తూనే కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా కొత్తగా రూ.200 నోటును తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసిందని వార్తలు వెలువడుతున్న తరుణంలో.. రూ .2వేల నోటును ఆర్‌బీఐ బ్యాన్ చేస్తే మళ్లీ రూ. 1000 నోటును మార్కెట్‌లోకి తీసుకొస్తుందా? అనే చర్చ మొదలైంది.
దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియాలో రూ.1000 నోటు కొత్త రూపుతో ప్రత్యక్షమైంది. ఇది కాస్త వైరల్ అయింది. అయితే, ఇది ఫేక్ న్యూస్‌గానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రూ. 1000 నోటుపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరీ ముఖ్యంగా ఆర్‌బీఐ ముద్రించే ఏ కరెన్సీపైన అయినా.. ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ ఈ నోటుపై మహాత్మాగాంధీ సంతకం ఉండడం విశేషం. కాగా, గతంలోనూ ఇలాగే రూ.1000 నమూనా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.