వివాదాస్పదమవుతోన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Rajasthan Lawmaker Asks Woman Sarpanch To Sit On Floor - Sakshi

జైపూర్‌ : మహిళా సర్పంచ్‌ను కింద కూర్చోమని అవమానించిన ఓ కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వివరాలు.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు గాను జోధ్పూర్‌ ఎమ్మెల్యే దివ్య మదేర్న ఖేటసార్‌ గ్రామంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ చందు దేవి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు సర్పంచ్‌ వేదిక మీదకు వెళ్లి ఎమ్మెల్యే పక్కన కూర్చోవాలని భావించారు. కానీ దివ్య మదేర్న సర్పంచ్‌ను కింద కూర్చోమని ఆదేశించారు. దాంతో వివాదం రాజుకుంది.

ఓ మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి.. మరో మహిళా సర్పంచ్‌ను ఇలా అవమానించడం మంచి పద్దతి కాదంటూ రాజస్తాన్‌ ​సర్పంచ్‌ సంఘ్‌ నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాక సదరు ఎమ్మెల్యే చందూ దేవికి క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ విషయం గురించి ఎమ్మెల్యే దివ్య మదేర్న మాట్లాడుతూ.. ‘సదరు సర్పంచ్‌ బీజేపీకి చెందిన మహిళ. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే కార్యక్రమంలో ఆమెను వేదిక మీదకు ఎలా ఆహ్వానిస్తాం’ అని ప్రశ్నించారు.

ఆ తర్వాత మాట మారుస్తూ.. ‘చందు దేవి ముఖంపై ముసుగు వేసుకుని ఉన్నారు. ఆమెను నేను గుర్తు పట్టలేదు. చందు దేవి కూడా అదే గ్రామానికి చెందిన సాధరణ మహిళ అనుకున్నాను. ఆమె వేదిక  మీదకు వచ్చి నా పక్కన కూర్చోబోతుండటం చూసి నాకు ఏదైనా హానీ చేస్తుందేమోనని భావించి కింద కూర్చోమని చెప్పాను’ అని తెలిపారు. ఏది ఏమైనా మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి సాటి మహిళను గౌరవించకపోవడం దారుణమంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top