యూపీలో వర్షాలకు 58 మంది బలి

Rain fury claims 31 lives in UP; Yamuna breaches danger mark in Delhi - Sakshi

ఈ సీజన్‌లో 6 రాష్ట్రాల్లో 537 మంది మృత్యువాత

లక్నో: భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఒక్కరోజే 31 మంది మృతిచెందారు. దీంతో మూడు రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో చనిపోయినవారి సంఖ్య 58 మందికి పెరిగింది. సహరాన్‌పూర్‌లో 11 మంది, మీరట్‌లో 10 మంది మరణించారు. మీరట్‌లో 23 సెం.మీల వర్షపాతం నమోదైంది. శారద, గాగ్రా నదులు ప్రమాదకర స్థాయిల్లో ప్రవహిస్తున్నట్లు కేంద్ర జలవనరుల కమిషన్‌ తెలిపింది. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, అందులో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఇద్దరు యాత్రికులు వరదల్లో కొట్టుకుపోయారు.

వందల్లో వరద మృతులు..
ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఇప్పటి వరకు వర్షాలు, వరదల్లో చిక్కుకుని ఆరు రాష్ట్రాల్లో 537 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ అత్యవసర ప్రతిస్పందనా కేంద్రం(ఎన్‌ఈఆర్‌సీ) తెలిపింది. మహారాష్ట్రలో గరిష్టంగా 139 మంది మృతిచెందగా, కేరళలో 126 మంది, పశ్చిమ బెంగాల్‌లో 116 మంది, ఉత్తరప్రదేశ్‌లో 70 మంది, గుజరాత్‌లో 52 మంది, అసోంలో 34 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 26 జిల్లాలు, పశ్చిమబెంగాల్‌లో 22 జిల్లాలు, అసోంలో 21 జిల్లాలు, కేరళలో 14 జిల్లాలు, గుజరాత్‌లో 10 జిల్లాలు వరదలకు గురయ్యాయి. అసోంలో సుమారు 2.17 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు.

యమున వరదలపై అత్యవసర భేటీ
యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ శనివారం ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలను ఆదేశించారు. హాత్ని కుంద్‌ బ్రిడ్జ్‌ నుంచి హరియాణా 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. ఆదివారం ఆ నీరు ఢిల్లీకి చేరుకునే అవకాశాలున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top