ప్రత్యేక రైళ్లు: తాజా మార్గదర్శకాలు

Railways Revises Guidelines for Shramik Trains - Sakshi

న్యూఢిల్లీ: వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను సవరించింది. ఎక్కువ మందిని తరలించేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్ల సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 1,200 నుంచి 1,700కు పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. స్లీపర్ బెర్తుల సంఖ్యకు సమానంగా సీట్లు ఉండాలని సూచించింది. గమ్యస్థానం కాకుండా మూడు చోట్ల ఈ రైళ్లు ఆపాలని పేర్కొంది. వలస కార్మికులను వేగంగా తరలించేందుకు రాష్ట్రాలు ఉదారంగా అనుమతి ఇవ్వాలని కోరింది. ఆదివారం రాష్ట్రాలతో హోంశాఖ కార్యదర్శి జరిపిన సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. వలస కార్మికుల తరలించేందుకు అనుమతి ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌కు హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (గుడ్‌న్యూస్‌: రేపట్నుంచి రైలు కూత)

వలస కార్మికుల కోసం మరిన్ని శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడపడంలో రైల్వే శాఖకు సహకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో హోం మంత్రిత్వ శాఖ అజయ్ భల్లా కోరారు. ప్రత్యేక రైళ్లు ఎక్కడానికి వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వలస కార్మికులు రోడ్లు, రైలు పట్టాల వెంట నడవకుండా చూడాలని కోరారు. కాగా, రైల్వేశాఖ మే 1 నుంచి 428 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 4.5 లక్షల మందికి పైగా వలసదారులను ఇప్పటివరకు గమ్యానికి చేర్చినట్టు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. (విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top