ఆర్టీఐ జాతకం ‘ఇలా ఎలా’ మారింది?

President Kovind Should Send Back RTI Amendment Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పనితీరులో అవినీతిని, ఆశ్రితపక్షపాతాన్ని అరికట్టేందుకు 2005, జూన్‌ నెలలో నాటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)’ సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ దురదృష్టవశాత్తు ఇటీవల ఆమోదించిన విషయం తెల్సిందే. ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గకుండా స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలుగా ఈ చట్టం కింద సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల స్థాయిని కల్పించారు. అంటే జీత భత్యాలు వారితో సమానంగా ఉంటాయి. నిర్దిష్ట పదవీకాలం ఐదేళ్లయినప్పటికీ జీతభత్యాలు మాత్రం ఎన్నికల కమిషనర్లకు మారినప్పుడల్లా మారుతుంటాయి. అలా కాకుండా సమాచార కమిషనర్ల జీత భత్యాలు, వారి పదవీకాల పరిమితిని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొస్తూ ఇటీవల ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదించింది.

సీబీఐ విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల మాదిరిగా ఇక నుంచి సమాచార కమిషనర్ల వ్యవస్థ కూడా ‘యజమాని పలుకులు పలికే పంజరంలో రామ చిలక’ చందంగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందన్నమాట. వాస్తవానికి 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీఐ బిల్లును పార్లమెంట్‌ స్థాయి సంఘానికి పంపించినప్పుడు సమాచార కమిషనర్ల స్వతంత్ర ప్రతిపత్తి కోసం వారికి ఎన్నికల కమిషనర్ల స్థాయి కల్పించాలంటూ సిఫార్సు చేసిందే నాటి బీజేపీ ఎంపీలు. వారిలో ముఖ్యమైన వారు నేటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. మరి ఎందుకు ఇప్పుడు అందులో సవరణ తీసుకరావాల్సి వచ్చింది? ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటయిందని, ఆర్టీఐ చట్టాన్ని రూపొందించనదేమో పార్లమెంట్‌ అని, అందుకనే అ చట్టాన్ని సవరిస్తున్నామని పాలకపక్ష బీజేపీ పార్లమెంట్‌లో సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. అసలు ఆర్టీఐ చట్టం వచ్చిందే రాజ్యాంగంలోని 19(1)ఏ అధికరణ కింద. ‘1981 నాటి ఎస్పీ గుప్తా’ కేసులో ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని మొదటి సారి సుప్రీం కోర్టు ప్రకటించింది. అందుకు రాజ్యాంగంలోకి 19 (1)ఏ అధికరణ దోహదం చేస్తుందని కూడా చెప్పింది. అయినప్పటికీ కొంత గందరగోళం ఉండడంతో 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రీడమ్‌ ఆఫీ ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌’ను తీసుకొచ్చింది. ఇదే 2004, డిసెంబర్‌ నెలలో ‘రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌’గా రూపాంతరం చెందింది. ఎన్నికల కమిషన్‌ స్థాయి ‘నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’ లాంటి సంస్థలకు ఉన్నప్పుడు ఆర్టీఐకి ఉంటే తప్పేమిటీ?

పార్లమెంట్‌ ఆమోదించిన ఆర్టీఐ సవరణ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనకు వచ్చినందున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాటి తన అభిప్రాయానికి కట్టుబడి బిల్లును తిరస్కరించాలని కోరుతూ కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌ శైలేష్‌ గాంధీ ఓ వినతి పత్రాన్ని పంపించారు. దానిపై ప్రముఖ సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్, అరుణారాయ్, నికిల్‌ దేవ్, అమృత జోహ్రి, రాకేష్‌ దుబ్బుడు సహా 1.27 లక్షల మంది పౌరులు ఆ వినతి పత్రంపై సంతకాలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top