న్యాయవ్యవస్థ కృషి అమోఘం

President Kovind at International Judicial Conference - Sakshi

‘లింగపరమైన న్యాయం’పై లక్ష్యాన్ని సాధించిందన్న రాష్ట్రపతి కోవింద్‌

పర్యావరణ సమస్యలకు అంతర్జాతీయ చట్టాలు అవసరమన్న సీజేఐ

ముగిసిన అంతర్జాతీయ న్యాయ సదస్సు

న్యూఢిల్లీ: లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి ప్రసంగించారు.

‘లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని సాధించడంలో భారత సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ చురుకైన, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసింది. పని చేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విశాఖ మార్గదర్శకాలు మొదలుకొని, సైన్యంలో మహిళా అధికారులకు కమాండ్‌ పోస్టుల్లో నియమించేందుకు ఉద్దేశించిన పర్మినెంట్‌ కమిషన్‌ ఏర్పాటు వరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశాన్ని ప్రగతిశీల సామాజిక పరివర్తన దిశగా తీసుకెళ్తున్నాయి’అని పేర్కొన్నారు.

‘దేశంలో భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడం హర్షణీయం. సామాన్యులకు న్యాయాన్ని సులభతరం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సంస్కరణలను తెచ్చింది. సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పులు రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థ మరింత పటిష్టం చేశాయి. న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్న వివిధ లోపాలను గుర్తించి, సరిచేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం చేపట్టిన నిశ్శబ్ద విప్లవంగా చెప్పుకోవచ్చు.

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమతూకం సాధించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు అనేక దేశాల దృష్టిని ఆకర్షించాయి. సమాచార సాంకేతికాభివృద్ధి కారణంగా తలెత్తిన సమాచార పరిరక్షణ, గోప్యతా హక్కు వంటి సమస్యలను న్యాయవ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంది’అని పేర్కొన్నారు. ‘లింగపరమైన న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణపై సమకాలీన దృక్పథాలు, మారుతున్న ప్రపంచంలో రాజ్యాంగానికి గతిశీల వ్యాఖ్యానం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమన్వయం, నేటి ఇంటర్నెట్‌ యుగంలో గోప్యతా హక్కు రక్షణ అనే ఐదు వేర్వేరు అంశాలు ప్రపంచ న్యాయవ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నిటిలోనూ లింగపరమైన న్యాయం అనే అంశమే ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రాధాన్యంగా ఉంది.

పెరుగుతున్న ప్రజాకర్షక విధానాలపై గత దశాబ్దంలో రాజ్యాంగ విలువల ప్రాతిపదికన విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామం రాజ్యాంగాల మూలాలపై మరో చర్చకు తెరలేపింది’అని తెలిపారు. ప్రపంచవేగంగా, అనూహ్యంగా ఇటీవలి కాలంలో పరిణామం చెందుతూ వస్తోంది. దీనివల్ల న్యాయవ్యవస్థ మరింత క్రియాశీలకంగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం, రాజీ మార్గాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తీర్పులను సత్వరం వెలువరించడంలో కోర్టులు చాలా ప్రగతిని సాధించాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.

పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే: సీజేఐ
పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే పేర్కొన్నారు. ‘పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే. పర్యావరణ అంశాలను జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు అడ్డుకాజాలవు. భూమిపై మనిషి ఒక బీజంగా మాత్రమే కాదు, పరాన్నజీవిగా మారాడు. భూమికి ఇస్తున్న దానికంటే భూమి నుంచి మనిషి తీసుకునేదే ఎక్కువనే అభిప్రాయం ఉంది. అందుకే పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒకే విధమైన అంతర్జాతీయ చట్టాలు అవసరం’అని సీజేఐ తెలిపారు. ‘దేశంలోని 103 కోట్ల ప్రజల హక్కులకు జవాబుదారీగా ఉంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్ష మేరకు తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో వివిధ ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top