'బీమ్స్‌' బీచ్‌గా రిషికొండ అభివృద్ధి: కేంద్ర మంత్రి

Prakash Javadekar: Rishikonda Beach Will Development on BEAMS project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలోని రిషికొండ బీచ్‌కు మహర్దశ పట్టబోతోంది. దేశంలోని 13 బీచ్‌లను అంతర్జాతీయ స్థాయి బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘బీచ్‌ ఎన్విరాన్‌మెంట్‌ & ఈస్థటిక్స్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’ (బీమ్స్‌) ప్రాజెక్ట్‌లో రిషికొండ బీచ్‌కు చోటు దక్కినట్లు పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ప్రాచీన కోస్తా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణహిత బీచ్‌లుగా పర్యాటకలను ఆకర్షించే బీచ్‌లను రూపొందించడం బీమ్స్‌ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశంలోని కోస్తా తీరం కలిగిన రాష్ట్రాలలోని 13 బీచ్‌లను ఈ కార్యక్రమం కోసం గుర్తించినట్లు ఆయన చెప్పారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని రిషికొండ బీచ్‌ ఒకటి అని అన్నారు.  బీమ్స్‌ కార్యక్రమం కింద చేపట్టే బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా బీచ్‌ పర్యాటకుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తారన్నారు.

పర్యాటకుల కోసం బీచ్‌లో పర్యావరణహితమైన బయో టాయిలెట్ల నిర్మాణం, ఆధునిక స్నానాల గదులు, శుద్ధి చేసిన తాగు నీరు, పాత్‌వేస్‌, సీటింగ్‌ సౌకర్యాలు, గొడుగుల కింద కూర్చోవడానికి వీలుగా చెక్క కుర్చీలు, పిల్లల ఆట స్థలాలు, ఫిట్‌నెస్‌ పరికరాలు, ఫస్ట్‌ ఎయిడ్‌ స్టేషన్‌, క్లాక్‌ రూమ్‌ సౌకర్యం, వాహనాల పార్కింగ్‌ స్థలం, బీచ్‌ లేఔట్‌, సైనేజ్‌లు వంటి సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే బీచ్‌లో గార్డెనింగ్‌, టాయిలెట్లలో ఫషింగ్‌ కోసం నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా గ్రేవాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నెలకొల్పుతారు. బయో-వేస్ట్‌ను శుద్ధిచేయడానికి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను, విద్యుత్‌ అవసరాల కోసం సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే బీచ్‌ ప్రాంతమంతా సీసీటీవీ నిఘాలో ఉంటుందని, బీచ్‌ పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా గార్డులు ఉంటారన్నారు.  వీటికి తోడు భద్రత కోసం వాచ్‌ టవర్లు, తగినంత భద్రతా సామాగ్రితో లైఫ్‌ గార్డులను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని మంత్రి చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top