సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీలైనంత త్వరగా విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు. శశిథరూర్తో సహా ఆయన బంధువులను పోలీసులు నోటీసులు పంపించారు. సునంద పుష్కర్ కేసు దర్యాప్తునకు నలుగురితో కూడిన బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. కాగా శశిథరూర్ ప్రస్తుతం అనారోగ్యంతో కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేరళకు పయనం అయ్యారు. అలాగే సునంద పుష్కర్కు చికిత్స చేసిన వైద్యులను సిట్ అధికారులు విచారించనున్నారు.
కాగా తన భార్య సునందా పుష్కర్ హత్యకేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని శశి థరూర్ ఆరోపించారు. సునందది హత్య అన్న విషయం ఇంకా వెలుగులోకి రాకముందే.. అంటే నవంబర్ 12వ తేదీనే ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సికి ఆయన ఓ లేఖ రాశారు. ఢిల్లీ పోలీసులు తరచు తన ఇంట్లో పనిచేసే మనిషి నారాయణ్ సింగ్ను శారీరకంగా హింసించి, భయపెట్టి, ఈ హత్య తామిద్దరం కలిసి చేసినట్లుగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అక్రమమని థరూర్ అన్నారు. ఈ లేఖపై బస్సీ మాట్లాడుతూ శశి థరూర్ ఆరోపణలపై విచారణ జరుపుతామని తెలిపారు.