ఐక్యంగా ఉగ్రపోరు సాగించాలి 

PM Modi On Visit To South Korea Awarded Seoul Peace Prize - Sakshi

అంతర్జాతీయ సమాజానికి భారత్‌ పిలుపు

ఉగ్రమూకలు, వారికి నిధుల మార్గాలను సంపూర్ణంగా నాశనం చేయాలి

దక్షిణ కొరియా పర్యటనలో ప్రధాని మోదీ విజ్ఞప్తి

మోదీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం

భారత్‌– దక్షిణ కొరియాల మధ్య ఆరు ఒప్పందాలు

సియోల్‌: ఉగ్రమూకలను, వారికి నిధులు చేరవేస్తున్న మార్గాలను సమూలంగా నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం ఏకమై చర్యలు తీసుకునే సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్తాన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత 40 ఏళ్లుగా భారత్‌ సీమాంతర ఉగ్రవాదానికి బాధితురాలిగా మారుతోందనీ, దేశంలో జరుగుతున్న శాంతియుత అభివృద్ధిని ఇది తరచుగా నాశనం చేస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. మోదీ రెండ్రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటిస్తుండటం తెలిసిందే. శుక్రవారం సియోల్‌లో విలేకరులతో మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమై, మాటలకు మించి చర్యలు చేపట్టే సమయం వచ్చిందని అన్నారు. ‘మానవత్వాన్ని నమ్మే వాళ్లందరూ చేతులు కలపాలి. ఉగ్రవాద సంస్థలను, వాటికి నిధులను అందజేస్తున్న మార్గాలను, ఉగ్రవాద భావాలను, ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయాలి. అలా చేసినప్పుడే ద్వేషం స్థానంలో సామరస్యం ఏర్పడుతుంది’ అని మోదీ తెలిపారు. పుల్వామా ఉగ్రవాద దాడి విషయంలో భారత్‌కు బాసటగా నిలిచినందుకు దక్షిణ కొరియాకు ధన్యవాదాలు తెలిపారు. 

ఆర్థిక పరివర్తనంలో కీలక భాగస్వామి..
భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియా కీలక భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు. తన పర్యటనలో రెండో రోజైన శుక్రవారం మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌–జే–ఇన్‌తో కలిసి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహాకారం పెంపొందించే దిశగా చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ భారత ఆర్థిక పరివర్తనంలో దక్షిణ కొరియాను ఒక విలువైన భాగస్వామిగా మేం భావిస్తామన్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్‌ డాలర్లకు పెంచేందుకు గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు.అంతకుముందు మూన్‌–జే–ఇన్‌ అధికారిక నివాసం, కార్యాలయం వద్ద మోదీకి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం లభించింది.

ఈ బహుమతి ఎంతో ప్రత్యేకం 
2018 ఏడాదికి సియోల్‌ శాంతి బహుమతిని మోదీకి దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ బహుమతిని గతేడాది అక్టోబర్‌లోనే మోదీకి ప్రకటించారు. మోదీ ఈ బహుమతి గురించి మాట్లాడుతూ ఇది ఎంతో ప్రత్యేకమైనదన్నారు. 1988లో సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్‌ విజయవంతమైనందుకు గుర్తుగా దీనిని ఏటా ఇస్తున్నారు. ఈ అవార్డు కింద మోదీకి 2 లక్షల డాలర్ల (రూ. 1.3 కోట్లు) నగదు లభించగా, ఆ మొత్తాన్ని గంగానది ప్రక్షాళన నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  ‘ఉగ్రవాదంపై పోరులో భారత్‌ ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోదీ చెప్పారు. సియోల్‌లోని జాతీయ శ్మశానాన్ని కూడా మోదీ సందర్శించి, అమర జవాన్లకు నివాళులర్పించారు. కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధంలోనూ, ఇతర సందర్భాల్లోనూ మరణించిన దక్షిణ కొరియా సైనికుల అంత్యక్రియలు ఈ శ్మశానంలో నిర్వహించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top