
శుక్రవారం ఢిల్లీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైస్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించా రు. ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి వరకు ప్ర యాణికులకు సేవలు అందించనుంది. ‘వందే భారత్ రైలును రూపొందించిన డిజైనర్లు, ఇంజనీర్లకు చాలా కృతజ్ఞుడినై ఉంటాను. నాలుగున్నరేళ్లుగా చాలా కఠోర శ్రమతో, నిజాయితీతో రైల్వే వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రయత్నిం చాం’అని ప్రధాని పేర్కొన్నారు. ‘ఏక్ భారత్– శ్రేష్ట్ భారత్’స్ఫూర్తికి వందే భారత్ రైలు ప్రతినిధి అని పేర్కొన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ఆధునీకరణలో, డీజిల్ కోచ్‌లను ఎలక్ట్రిక్ కోచ్‌లుగా మార్చడంలో, మేకిన్ ఇండియాలో భాగంగా కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడంలో రైల్వే ఎంతో కృషి చేసిందని కొనియాడారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పారు. రైల్వేలో 2014 నుంచి ఇప్పటివరకు 1.5 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందని అధికారులు తనతో చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుత భర్తీ నోటిఫికేషన్లతో ఈ సంఖ్య 2.25 లక్షలకు చేరుతుందని చెప్పారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 18 నెలల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. ఈ రైలులో రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు సభ్యులు తదితరులు ప్రయాణించారు.
రైలు లోపల సౌకర్యాల గురించి మోదీ, పీయూష్ గోయెల్‌కు వివరిస్తున్న రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్
8 గంటల్లో వారణాసికి..
ఢిల్లీ నుంచి బయల్దేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసికి 8 గంటల్లో చేరుకుంటుంది. సాధారణ రైళ్లలో మాత్రం 11.5 గంటల సమయం పడుతుంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. వారంలో ఐదు రోజుల పాటు నడవనుంది. ఈ రైలు ఫిబ్రవరి 17 నుంచి ప్రయాణికులకు అం దుబాటులోకి రానుంది. ఇందులో 16 ఏసీ కోచ్ లు ఉన్నాయి. మొత్తం 1,128 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఆటోమేటిక్ తలుపులు ఏర్పాటు చేశారు. వైఫై సదుపాయం, జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం ఇలా అనేక అధునాతనమైన సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కాగా, వందే భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఫిబ్రవరి 17న అన్ని టికెట్లు అమ్ముడైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. వారణాసి నుంచి ఢిల్లీకి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించేందుకు రూ.3,310, చైర్‌కార్‌లో రూ.1,760 టికెట్ ధర నిర్ణయించారు.