మార్పునకు ఉత్ప్రేరకాలు కండి

PM asks Governors to be catalytic agents of change in society - Sakshi

ప్రజా ఉద్యమంతోనే నవభారత్‌ కల సాకారం

గవర్నర్ల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం

అభివృద్ధిలో కొత్త ప్రమాణాలు నెలకొల్పండి: కోవింద్‌

న్యూఢిల్లీ: రాజ్యాంగ పవిత్రతను పరిరక్షిస్తూనే గవర్నర్లు సమాజంలో మార్పు కోసం  ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో గురువారం ప్రారంభమైన రెండు రోజుల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్ల సదస్సులో ప్రధాని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, 27 రాష్ట్రాల గవర్నర్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022 కల్లా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నవభారత్‌ను ప్రస్తావించారు. ఇదొక ప్రజా ఉద్యమంగా మారితేనే ఆ లక్ష్యం సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు. ముద్ర పథకం కింద దళితులు, మహిళలు, గిరిజనులకు రుణాలిచ్చేలా బ్యాంకులను గవర్నర్లు ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

స్ఫూర్తినిస్తున్న పండుగలు:   
స్వచ్ఛ భారత్‌ అమలులో  గవర్నర్లు ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. బహిరంగ మల విసర్జన రహిత సమాజ లక్ష్య సాధనకు జాతిపిత గాంధీజీయే స్ఫూర్తి అని పేర్కొన్నారు. మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలకు పండుగలు, వార్షికోత్సవాలు వంటివి ప్రేరేపకాలుగా పనిచేస్తాయన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో సౌర విద్యుత్, సబ్సిడీలకు ప్రత్యక్ష నగదు బదిలీ, కిరోసిన్‌ రహిత సమాజం కోసం అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ఇతర రాష్ట్రాలతో పంచుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్లనుద్దేశించి పేర్కొన్నారు.

పాలకులతో మమేకం కావాలి: కోవింద్‌
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ...రాష్ట్ర శాసనకర్తలతో సమాలోచనలు జరపడం ద్వారా గవర్నర్లు అభివృద్ధిలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం గవర్నర్లు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత గురించి ప్రస్తుత సహకార సమాఖ్య వ్యవస్థలో ప్రముఖంగా ప్రస్తావించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, పోషకాహారలోపం, అపరిశుభ్రత లాంటివి లేని నవభారత్‌ కోసం సంబంధిత భాగస్వాములందరిలో స్ఫూర్తిని నింపి, వారితో కలసి పనిచేయాలని అన్నారు. వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలతో గవర్నర్లు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top