రైలు స్పీడ్‌ను పెంచిన గోయల్‌ గుట్టు రట్టు!

Piyush Goyal posts video of Speed Train And Internet trolls him For Doctoring Video - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇదో పక్షి, ఇదో విమానం....మేక్‌ ఇక్‌ ఇండియా కార్యక్రమం కింద నిర్మించిన సెమీ స్పీడ్‌ ట్రెయిన్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్, కాంతి వేగంతో దూసుకుపోతున్న దశ్యం’ అంటూ  కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ ఆదివారం నాడు ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన ఈ వీడియోను తన అధికార ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లోనూ పోస్ట్‌ చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ ‘భారత్‌లో తయారైన ప్రపంచ శ్రేణి రైలును చూడడం ఆనందంగా ఉంది. ఈ ఘనత ప్రత్యేకంగా భారతీయ రైల్వేకే దక్కుతుంది’ అనే సందేశంతో పియూష్‌ గోయల్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ల ఆధారంగా బీజేపీ ఎంపీకి చెందిన ‘రిపబ్లిక్‌ టీవీ’ అమోఘం, అద్భుతం అంటూ ఏకంగా ఓ వార్తా కథనాన్ని నడిపింది.

అయితే సామాజిక మీడియాల్లో చక్కర్లు కొట్టిన ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ వీడియోపై కాసేపటికే దుమారం చెలరేగింది. ‘పియూష్‌ గోయల్‌ గారు మీరు అప్‌లోడ్‌ చేసిన వీడియో ఒరిజనల్‌ కాదు, ఒరిజనల్‌ వీడియాలో ఉన్న రైలు స్పీడ్‌ను రెట్టింపు చేసి వీడియోను మీరు విడుదల చేశారు. ది రెయిల్‌ మెయిల్‌ యూటూబ్‌ ఛానల్‌లో ఒరిజనల్‌ వీడియో ఉంది చూసుకోండీ’ అంటూ ఓ ట్వీట్‌ వెలువడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే నకిలీ వార్తలను, మార్ఫింగ్‌ వీడియోలను ఎప్పటికప్పుడు కనిపెట్టి బయటపెట్టే ‘ఆల్ట్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌’ పియూష్‌ గోయల్‌ విడుదల చేసిన వీడియో, ఒరిజనల్‌ వీడియో చూడండంటూ పక్క పక్కన రెండు వీడియోలను జతచేసి విడుదల చేసింది.

అంతే...పియూష్‌ గోయల్‌పై సోషల్‌ మీడియాలో ఛలోక్తులు వెల్లువెత్తాయి. ఓ పక్షి, ఓ విమానం ఏం కర్మ! ఎడ్ల బండి కూడా వేగంగా పరుగెత్తుతుందంటూ కొందరు, మోదీ ప్రభుత్వం హయాంలో పియూష్‌ గోయల్‌ వల్ల వేగంగా పరుగెత్తుతున్న ఎడ్లబండి అంటూ మార్పు చేసిన ఎడ్ల బండి వీడియోను మరొకరు పోస్టు చేశారు. కోడి, కాకి, బాతు రైలుపై వెళుతున్న చిత్రాన్ని, గాల్లో ఎగురుతున్న రైలు చిత్రాలను కొందరు పోస్ట్‌ చేశారు. ‘ఇప్పుడు గోయల్‌ 2 ఎక్స్‌ వేగాన్ని పెంచిన వీడియోను చూపించారు. మున్ముందు 6 ఎక్స్‌ వీడియోను చూపించి చైనాను అధిగమించిన భారత బుల్లెట్‌ రైలు అని చూపిస్తారు’ అంటూ ఇంకొకరు వాఖ్యానం చేశారు. ‘ఈ రైలు మార్గంలో ఇక ఆదాయం పెరుగుతుంది’ అంటూ పియూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యను ఒకరు ప్రస్తావిస్తూ ‘ఎందుకు పెరగదు! టిక్కెట్‌ కలెక్షన్లను వీడియోతీసి 4ఎక్స్‌ స్పీడ్‌లో చూస్తే సరిపోతుంది’ అని ఒకరు వ్యాఖ్యానించారు. దూసుకుపోతున్న రైలు వీడియోను హర్యానాలోని అసావ్టీ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించారు. సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే వార్తలను పియూష్‌ గోయల్‌ పోస్ట్‌ చేయడం ఇదే మొదటిసారి కాదు. అనేక సార్లు చేశారు. ఆయన్ని ఎవరు మందలించినట్లు లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top