పెట్రోల్, బంగారం మరింత ప్రియం

Petrol And Diesel Price Increase In India - Sakshi

పొగాకు ఉత్పత్తులు, విదేశీ కార్లు, ఏసీల ధరలు పైపైకి

తగ్గనున్న ‘ఎలక్ట్రిక్‌’ విడి భాగాలు, కెమెరా పరికరాల ధరలు

ఫోన్‌ చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సులు తక్కువ ధరలకే

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. ఇటు సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ఏసీల ధరలు సైతం అధికమవనున్నాయి. పన్నులు పెరుగుతుండటంతో వీటి ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల విడి భాగాలు, కెమెరా పరికరాలు, మొబైల్‌ ఫోన్ల చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సుల ధరలు తగ్గనున్నాయి. ‘మేకిన్‌ ఇండియా లక్ష్యాన్ని సుసంపన్నం చేసుకోవడంలో భాగంగా పలు వస్తువులపై సుంకాన్ని పెంచుతున్నాం..’అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్‌ వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయింపుని ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. ‘దేశీయ ముద్రణ రంగానికి ఊతమిచ్చేలా పామాయిల్‌కు సంబంధించిన స్టెరాయిన్, కొవ్వు నూనెలు, వివిధ రకాల కాగితపు ఉత్పత్తులపై మినహాయింపుని తొలగిస్తున్నాం. దిగుమతి చేసుకునే పుస్తకాలపై 5 శాతం కస్టమ్‌ డ్యూటీ విధిస్తున్నాం.’అని తెలిపారు.

పెట్రోల్, డీజిల్‌ ఒక లీటర్‌పై రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్‌ కింద రూ.1, ఎక్సైజ్‌ సుంకం కింద రూ.1 విధించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇక బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ఇటు బీడీలు, సిగరెట్లపై పరిమాణం, రకాన్ని బట్టి 10 పైసల నుంచి రూ.10 వరకు ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు. అలాగే హుక్కా, జర్దాలాంటి పొగాకు ఉత్పత్తులపై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు. పూర్తిగా విదేశాల్లో తయారైన వాహనాలు, విదేశీ కార్ల దిగుమతులపై 25 శాతం నుంచి 30 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. ఆటో మొబైల్‌ పరికరాలు, వాహనాల ఇం జన్ల ఫిల్టర్లు, అద్దాలు, తాళాలపై 2.5 శాతం నుంచి 5 శాతానికి.. మార్బుల్స్‌పై 20 శాతం నుంచి 40 శాతానికి, ఏసీలపై 10 శాతం నుంచి 20 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీని పెంచినట్లు చెప్పారు.

సెరామిక్‌ టైల్స్, గోడకు అతికించే టైల్స్‌ వంటి వాటిపై 10 శాతం నుంచి 15 శాతానికి.. దిగుమతి చేసుకునే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ దాని సంబంధిత పరికరాలపై 5 శాతం నుంచి 7.5 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ పెంచినట్లు వెల్లడించారు. ఇక సీసీటీవీ కెమెరా/ఐపీ కెమెరా చార్జర్, చార్జింగ్‌ కేబుల్, లౌడ్‌ స్పీకర్లు, ఆఫ్టికల్‌ ఫైబర్‌లపై 15 శాతం.. డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌), సీసీటీవీ కెమెరా, ఐపీ కెమెరాలపై 5 శాతం నుంచి 20 శాతం కస్టమ్‌ డ్యూటీ పెంచినట్లు ఆమె తెలిపారు. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల పరికరాలపై కస్టమ్‌ డ్యూటీని మినహాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీకి కావాల్సిన ముడి సరుకులు, కెమెరాకు సంబంధించిన పరికరాలు, మొబైల్‌ ఫోన్‌ చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సుల ధరలు మరింత తగ్గుతాయని వెల్లడించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top