
పర్లాకిమిడి : జిల్లాలో ఎండలు మండుతుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీంతో జిల్లాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుమ్మ, మోహనా రోడ్లపై పిట్టమనిషి కూడా కనిపించడంలేదు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావడంలేదు. పర్లాకిమిడిలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తున్నాయి. ఏప్రిల్‌లోనే ఇంతలా ఎండలు ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఎండలు అధికంగా ఉండడంతో భవన నిర్మాణ కార్మికుల ఉదయం 11 గంటలకే పనులు నిలిపివేసి మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తున్నారు. అలాగే ఉపాధి కార్మికులు ఉదయం 10 గంటల వరకు పనులు చేసి మళ్లీ సాయంత్రం చేయాలని జిల్లా ఉపాధి శాఖ అధికారి పి.వేణుగోపాలరావు స్పష్టం చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఉపాధి కార్మికులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చిన వారికి తాగునీటి సౌకర్యాలు లేకపోవడంతో కూల్ డ్రింకులు, చెరుకు రసం తదితర పానీయాలపై ఆధారపడుతున్నారు. దీంతో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, మార్కెట్, పోలీస్‌స్టేషన్ తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.