రూ.35 కోసం రెండేళ్ల పోరాటం..!

Passenger Gets Rs 33 Refund For Cancelled Ticket After 2 Years - Sakshi

ముంబై : సర్వీస్‌ టాక్స్‌ పేరుతో తన వద్ద అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఓ వ్యక్తి చేసిన రెండేళ్ల పోరాటం పలించింది. అతని వద్ద వసూలు చేసిన మొత్తాన్ని ఐఆర్‌టీసీ చెల్లిచింది. కోటాకు చెందిన ఓ రిటైర్డ్‌ ఇంజినీర్‌ 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏప్రిల్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. టికెట్‌ ధర రూ.765. అయితే, 2017 జూలై 1న గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ అమల్లోకి వచ్చిన కారణంగా అతను టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాడు. రిఫండ్‌గా రూ.100 తగ్గించుకొని ఐఆర్‌టీసీ అతనికి 665 చెల్లించింది. క్లరికల్‌ చార్జీలుగా రూ.65, సర్వీస్‌ టాక్స్‌గా రూ.35 కట్‌ చేసుకుంది.

అయితే, లెక్క ప్రకారం తన దగ్గర క్లరికల్‌ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, సర్వీస్‌ టాక్స్‌ అదనంగా వసూలు చేశారని సదరు ప్రయాణికుడు లోక్‌ అదాలత్‌లో పిటిషన్‌ వేశాడు. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఈ జనవరిలో లోక్‌ అదాలత్‌ స్పష్టం చేసింది. చివరగా ఆర్టీఐని ఆశ్రయించిన ప్రయాణికుడికి అనుకూల సమాచారం వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చే ముందు బుక్‌ చేసుకున్న టికె​ట్లపై విధించిన సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాలని ఆర్టీఐ వెల్లడించింది. 

ఆర్టీఐ కాపీని అటాచ్‌ చేస్తూ.. ఐఆర్‌టీసీని సంప్రదించడంతో అతని బ్యాంక్‌ ఖాతాలో రూ.33 జమ చేసింది. మరో రూ.2 కోత విధించింది. తనను ఇబ్బందులకు గురిచేయడంతో రెండు రూపాయలు కోత విధించారని, ఐఆర్‌టీసీపై మరోసారి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జీఎస్టీ కారణంగా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకున్న ప్రయాణికుల ద్వారా ఐఆర్‌టీసీకి ఏటా రూ.3.34 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top