మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి | Passenger Dies After Hand Struck In Kolkata Metro Door | Sakshi
Sakshi News home page

మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి

Jul 14 2019 3:20 PM | Updated on Jul 14 2019 3:20 PM

Passenger Dies After Hand Struck In Kolkata Metro Door - Sakshi

తీవ్రంగా గాయపడిన సజల్‌ను ఆస్పత్రికి తరలించగా..

కోల్‌కతా : నగరంలోని పార్క్‌ స్ట్రీట్‌ మెట్రో స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మెట్రో రైలు తలపుల మధ్య చెయ్యి ఇరుక్కోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని కస్బా ప్రాంతానికి చెందిన సజల్‌ కాంజీలాల్‌ శనివారం సాయంత్రం పార్క్‌ స్ట్రీట్‌ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు యత్నించాడు. తొలుత తలపుల మధ్య చెయ్యి పెట్టి మెట్రో ఎక్కబోయాడు. అయితే డోర్స్‌ లాక్‌ అయి మెట్రో ముందుకు కదలింది. దీంతో రైలు అతన్ని లాక్కువెళ్లింది. ఇది గమనించిన సిబ్బంది ట్రైన్‌ను నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన సజల్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.    

మెట్రో జనరల్‌ మేనేజర్‌ పీసీ శర్మ ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ట్రైన్‌ డోర్‌ సెన్సార్లు పనిచేయకపోవడానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రైన్‌ను నిలిపివేసి, విద్యుత్‌ సరఫరా ఆపివేశామని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికులను కూడా మెట్రో నుంచి దింపివేశామని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం మెట్రో సేవలకు కొద్దిపాటి అంతరాయం ఏర్పడింది. స్టేషన్‌ వద్దకు చేరుకున్న ప్రయాణికులు ఈ ప్రమాదానికి మెట్రో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ఇలా జరగడం బాధకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

పోల్

Advertisement