breaking news
Park Street station
-
మెట్రోలో చెయ్యి ఇరుక్కుని వ్యక్తి మృతి
కోల్‌కతా : నగరంలోని పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్లో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మెట్రో రైలు తలపుల మధ్య చెయ్యి ఇరుక్కోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని కస్బా ప్రాంతానికి చెందిన సజల్ కాంజీలాల్ శనివారం సాయంత్రం పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కేందుకు యత్నించాడు. తొలుత తలపుల మధ్య చెయ్యి పెట్టి మెట్రో ఎక్కబోయాడు. అయితే డోర్స్ లాక్ అయి మెట్రో ముందుకు కదలింది. దీంతో రైలు అతన్ని లాక్కువెళ్లింది. ఇది గమనించిన సిబ్బంది ట్రైన్‌ను నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన సజల్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మెట్రో జనరల్ మేనేజర్ పీసీ శర్మ ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ట్రైన్ డోర్ సెన్సార్లు పనిచేయకపోవడానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రైన్‌ను నిలిపివేసి, విద్యుత్ సరఫరా ఆపివేశామని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికులను కూడా మెట్రో నుంచి దింపివేశామని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం మెట్రో సేవలకు కొద్దిపాటి అంతరాయం ఏర్పడింది. స్టేషన్ వద్దకు చేరుకున్న ప్రయాణికులు ఈ ప్రమాదానికి మెట్రో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇలా జరగడం బాధకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
అసలే సొరంగం.. ఆపై చిమ్మచీకటి..
కోల్ కతా: అసలే సొరంగం.. ఆపై చిమ్మచీకటి.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కోల్‌కతా మెట్రో ప్రయాణికులు సోమవారం ఉదయం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. సొరంగంలో ప్రయాణిస్తున్న నాన్ ఏసీ మెట్రో రైలు ఒక్కసారిగా పట్టాలపై ఆగిపోయింది. దాంతో పాటు లైట్లు కూడా ఆరిపోవడంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. మెట్రో సిబ్బంది సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చేవరకు వారంతా చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. డమ్ డమ్ కు బయలుదేరిన మెట్రో రైలు పార్క్ స్ట్రీట్ స్టేషన్ దాటిన తర్వాత ఇంజిన్ చెడిపోవడంతో సొరంగంలో నిలిచిపోయింది. ఈ ఉదయం 11.25 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆఫీసులకు బయలుదేరిన వారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాన్ ఏసీ రైలు కావడంతో గాలి ఆడక దాదాపు రెండు గంటల పాటు సతమతమయ్యారు. రైల్వే సిబ్బంది నిచ్చెనలు ఏర్పాటు చేసి ప్రయాణికులను రైలు నుంచి దించి సొరంగం బయటకు రప్పించడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనకు సంబంధించి ఎవరిపైనా చర్య తీసుకోబోమని మెట్రో అధికారులు తెలిపారు.