ట్విటర్‌ సీఈఓకు ఊరట..!

Parliamentary Panel On IT Says Twitter CEO Will Not Appear Before Us - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమాచార సాంకేతికతపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్‌ నిర్ణయంతో ట్వీటర్‌ సీఈవో జాక్‌ డోర్సేకు ఊరట లభించింది. ప్యానెల్‌ ఎదుట డోర్సే హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అతని తరపున కంపనీ పబ్లిక్‌ పాలసీ హెడ్‌ కోలిన్‌ క్రోవెల్‌ హాజరు కావొచ్చని లోక్‌సభ సభ్యుడు అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌ తెలిపింది. సోషల్‌ మీడియాలో పౌరుల సమాచారం లీక్‌ అవుతుందనే భయాల నేపథ్యంలో ట్విట్టర్‌ సీఈవోతోపాటు ఇతర ఉన్నత అధికారులు ఫిబ్రవరి 25లోగా తమముందు హాజరుకావాలని ప్యానెల్‌ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. (ట్విటర్‌కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం)

అయితే, జాక్‌ డోర్సే కాకుండా అతని తరపున ట్విటర్‌ ఇండియా ప్రతినిధులు ప్యానెల్‌ ఎదుట హాజరయ్యేందుకు ఫిబ్రవరి 11న పార్లమెంటుకు వెళ్లినప్పటికీ వారిని కలిసేందుకు సభ్యులు నిరాకరించారు. సంస్థ సీఈఓ నేరుగా హాజరు కావాలని ప్యానెల్‌ తేల్చిచెప్పింది. దాంతో జాక్‌ డోర్సే ప్యానెల్‌ ఎదుట హాజరవుతాడని అందరూ భావించారు. అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థల్లో యూజర్ల డాటా లీక్‌ కావడాన్ని, ఆ సమాచారాన్ని ఎన్నికల్లో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉపయోగించుకున్నట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఐటీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్‌ ట్విటర్‌ సీఈఓ తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ప్యానెల్‌ తాజా నిర్ణయంతో కోలిన్‌ క్రోవెల్‌ ఇండియాకు రానున్నారు.

(ట్విట్టర్‌ రెక్కలు కత్తిరిస్తారా?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top